26.2 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం ఎట్టకేలకు దిగొచ్చిన పాకిస్తాన్: రేపు పైలట్‌ అభినందన్‌ విడుదల, స్వయంగా ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్…

ఎట్టకేలకు దిగొచ్చిన పాకిస్తాన్: రేపు పైలట్‌ అభినందన్‌ విడుదల, స్వయంగా ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్…

imran khan
- Advertisement -

abhinandan varthaman

ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్ దౌత్యం ఫలించింది. అంతర్జాతీయ ఒత్తిళ్లకు పాక్ ఎట్టకేలకు తలొగ్గింది. పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్న భారత వైమానిక దళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను శుక్రవారం విడుదల చేస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆ దేశ పార్లమెంట్‌లో ప్రకటించారు. అయితే తమ చర్యను ఇరుదేశాల మధ్య శాంతికి సంకేతంగా ఆయన అభివర్ణించారు.

మరోవైపు పుల్వామా ఉగ్రదాడిలో జైషే మహమ్మద్‌ పాత్ర, పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలు, వాటి నాయకత్వానికి సంబంధించి భారత్‌ బుధవారం పాకిస్తాన్‌కు వివరణపత్రం అందజేసిన విషయం తెలిసిందే.   ఈ నేపథ్యంలో భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై గురువారం ఆయన తమ పార్లమెంటులో ప్రసంగించారు.

‘‘జమ్మూకాశ్మీలోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై ఆధారాలు సమర్పించాలని నేను ముందుగానే భారత్‌కు చెప్పాను.  కానీ పాకిస్తాన్ భూభాగంలో భారత్ దాడి చేసింది. ఆ తర్వాత రెండు రోజులకి పాక్‌కు భారత్‌ వివరణ పత్రం అందజేసింది. ఈ పని ఇంతకు ముందే ఎందుకు చేయలేదు?’’ అని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నించారు.

అంతేకాదు, ‘‘పాక్‌ భూభాగంలో భారత్‌ దాడులు జరపకపోయి ఉంటే మేం కూడా భారత్‌ భూభాగంలో దాడులు జరిపేవాళ్లం కాదు. అయితే ఎవరూ కూడా పరిస్థితులు చేతులు దాటి పోయేలా వ్యవహరించకూడదు. లేకపోతే పాక్‌ ప్రతీకారం తీర్చుకునేదే. ఈ విషయాన్ని కొన్ని దేశాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నాయి..’’ అని ఇమ్రాన్ వ్యాఖ్యానించడం గమనార్హం.

‘‘యుద్ధం పరిష్కారం కాదు. కానీ, ఒకవేళ భారత్‌ ఏ చర్యలకైనా పాల్పడితే మేం తిప్పికొడతాం. కాశ్మీర్‌ గురించి చర్చలు జరగడం కూడా చాలా ముఖ్యమైన అంశం. కాశ్మీర్‌ వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. కాశ్మీరీలు స్వాతంత్ర్యం కోరుకుంటున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పడం మన ఉద్దేశం కాదు. నేను భారత ప్రధాని మోడీతో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నించాను..’’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు.

అంతేకాదు, ‘‘చర్చలు జరపాలని నేను భారత్‌కు చెప్పాను. కానీ, వారి నుంచి స్పందన రాలేదు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొంటున్న నేపథ్యంలో పాకిస్తాన్ మీడియా చాలా పరిణితితో వ్యవహరించింది. భారత్‌ విషయంలో మేం చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాం..’’ అంటూ ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.

అంతకుముందు ఏం జరిగిందంటే… 

ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గే పరిస్థితికి అవకాశం ఉందనుకుంటే తమ ఆధీనంలో ఉన్న భారత్ పైలట్‌ను విడిచిపెడతామని పాకిస్తాన్ గురువారం ప్రకటించింది. బుధవారం నియంత్రణ రేఖ అవతల భారత మిగ్ విమానం కూలిపోవడంతో ఆ విమానంలోని అభినందన్ వర్థమాన్ అనే భారత పైలట్‌ను పాక్ సైనికులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

‘‘ఉద్రిక్తతలు తగ్గి శాంతియుత పరిస్థితికి కారణమవుతుందంటే భారత పైలట్‌ను అప్పగించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం..’’ అని పాకిస్తాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీతో చెప్పారు. పాక్‌ ఆర్మీ కస్టడీలో ఉన్న భారత పైలట్ అభినందన్‌ వర్థమాన్ విడుదల అంశంపై మరో రెండు మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని ఫైజల్‌ వెల్లడించారు.

తమ ఆధీనంలో ఉన్న భారత పైలట్‌ను యుద్ధ ఖైదీ హోదాలో విడుదల చేయాలా? లేదా అన్న కోణంలో ఆలోచిస్తున్నామని తెలిపారు. పైలట్ అభినందన్‌ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నాడని స్పష్టం చేశారు.

ఇరుదేశాల మధ్య ప్రశాంత వాతావరణం కోసం ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్ ద్వారా మాట్లాడేందుకు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సిద్ధంగా ఉన్నారని పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ న్యూస్ఏజెన్సీ పీటీఐతో వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని భావిస్తే అభినందన్‌ను ఇండియాకు అప్పగిస్తామని వెల్లడించారు.

పైలట్‌ అప్పగింత విషయంలో సానుకూల దృక్పథంతోనే ముందుకు వెళ్తున్నామని ఖురేషి అన్నారు. ఇరు దేశాల మధ్య శాంతి, ప్రాంతీయ స్థిరత్వాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. యుద్ధం జరిగితే పాక్‌కే నష్టం జరుగుతుంది. కానీ భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాదా? అని ఖురేషి ప్రశ్నించారు.

చదవండి: శత్రువుకు లొంగదు.. పోరాటం ఆపదు: భారత్‌దే గెలుపంటూ మోడీ ప్రసంగం

- Advertisement -