న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారతదేశంలో నగదు చెల్లింపు సేవలను పరిశీలించేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెగ్యులేషన్స్ మేరకు వాట్సాప్ చెల్లింపుల డేటాను భద్రపరిచేందుకు తమ కార్యాలయాన్నిభారత్‌లోనే ఏర్పాటు చేస్తామని తెలిపింది.
వాట్సాప్ చెల్లింపులకు సంబంధించిన మొత్తం సమాచారం భారతదేశ వ్యవస్థలోనే ఉండాలని ఏప్రిల్ 6న ఆర్‌బీఐ వాట్సాప్‌కు నోటీసులు పంపించిన విషయం తెలిసందే. అక్టోబరు 15లోగా దీన్ని ఏర్పాటు చేయాలని నోటీసుల్లో పేర్కొంది. ఇందులో భాగంగా వాట్సాప్ భారత్‌లో చెల్లింపులకు సంబంధించి వ్యవస్థపు ఏర్నాటు చేస్తోంది.
ప్రయోగాత్మక దశలో భాగంగా భారత దేశంలో దాదాపు 10 లక్షల మంది వాట్సాప్ చెల్లింపు సేవలను ఉపయోగించుకుంటున్నారు. అయితే భారతదేశనికి సంబంధించిన డిజిటల్ పేమెంట్లు, వినియోగదారుల వివరాలు థర్డ్ పార్టీ దగ్గర కాకుండా భారతీయ సర్వర్లలోనే నిక్షిప్తం చేయాలని ఆర్‌బీఐ నోటీసులు పంపించింది.
అందులో ఎండ్ టు ఎండ్ లావాదేవీల వివరాలు, ఎవరికి నగదు వెళ్లింది, చెల్లింపు సూచనలను, అందుకు సంబంధించిన సందేశం, అన్నింటిని భారత్‌లోని సర్వర్లలో పొందుపరచాల్సిందిగా ఆర్‌బీఐ సూచించింది. ఈ నేపథ్యంలో ‘‘ఆర్‌బీఐ నింబధనల ప్రకారం వాట్సాప్ ద్వారా చెల్లింపులు చేస్తున్న వారి డేటాను భారతదేశంలోనే నిల్వచేసే విధంగా ఓ వ్యవస్థను రూపొందించాం..’’ అని వాట్సాప్ ప్రతినిధి వెల్లడించారు. వాట్సాప్ ఆధారిత నగదు చెల్లింపులను భారతదేశం మొత్తం విస్తరింపజేసేందుకు కంపెనీ ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు.