న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదిక ‘వాట్సప్’ నుంచి వెళ్లే వివిధ రకాల సందేశాలు ఎక్కడ నుంచి వెళుతున్నాయి, వాటిని ఎవరు రూపొందిస్తున్నారు అనే విషయన్ని దర్యాప్తు సంస్థలకు అవసరం అనుకుంటే ఇకనుండి సులువుగా గుర్తించొచ్చు. ఈ విషయమై వాట్సప్ యాజమాన్యం గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించింది. అమెరికా తర్వాత గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించింది భారతదేశంలోనే కావడం గమనార్హం.
ఇటీవల పిల్లల కిడ్నాపర్లు, గో రక్షకులు వంటి రకరకాల పేర్లతో సందేశాలు పంపి, దానికి కారణమైన వారి మీద దాడులు చేయడం దేశంలో సర్వ సాధారణమైంది. ఈ దాడులకు మూలమైన సందేశాలు ఎక్కడ నుంచి వచ్చాయి, వాటిని ఎవరు తయారు చేస్తున్నారో గుర్తించి, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్ణయించింది.
దర్యాప్తు సంస్థలకు అవసరమైతే…
దానికి అనుగుణంగా వాట్సప్ మేనేజ్‌మెంట్‌కు మత వైఖరిని కూడా తెలియజేసింది. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు అవసరమైతే సదరు వాట్సప్ సందేశాలు ఏ ప్రదేశం నుంచి ఎప్పుడు వచ్చింది, ఎవరు పంపారన్న విషయం తెలుసుకోవచ్చునని కేంద్ర ఐటీ, టెలీ కమ్యూనికేషన్లశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు వాట్సప్ ఉపాధ్యక్షుడు చిరిస్ డానియల్ సమాచారం ఇచ్చారు.
మరోవైపు వాట్సప్ సందేశాలు ఎక్కడ నుంచి ఎవరు పంపుతున్నారనే అంశాన్ని గుర్తించాలన్ననిర్ణయం వెనుక మరో నిగూఢార్థం కూడా ఉందని తెలుస్తోంది. అనవసరంగా హింసను ప్రేరేపించే అంశాలతో కూడిన సందేశాలను నియంత్రించడం బాగానే ఉంటుంది. కానీ ఇందులో రాజకీయ అవసరాలు కూడా ఇమిడి ఉన్నాయా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
సోషల్ మీడియా నియంత్రణ కోసమేనా?
ఇటీవలి కాలంలో కేంద్రాన్ని వ్యతిరేకించే ప్రజలు అధికమవుతున్నారు. కేంద్రం విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. దీనికి వాట్సప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా సంస్థలు వేదికలవుతున్నాయి. ఈ క్రమంలో ప్రజా ప్రయోజనాల పరిరక్షణ పేరిట సోషల్ మీడియాను నియంత్రించాలన్న వ్యూహాన్ని కేంద్రం అమలు చేయనున్నదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
వాట్సప్ ఉపాధ్యక్షుడు చిరిస్ డానియల్ రెండు రోజుల క్రితమే కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. ఆ తరువాత మంత్రి రవిశంకర్ మాట్లాడుతూ.. ‘సదరు సందేశాలను కనిపెట్టే అంశంపై మేం మాట్లాడాం. కానీ దాన్ని డీ కోడ్ చేసే అంశం చర్చకు రాలేదు. ఈ సందేశాలను పంపిన వ్యక్తి, అతడు లేదా ఆమె ఉన్న ప్రదేశాలను గుర్తించే అంశంపైనే మేం ఎక్కువగా దృష్టి సారించాం. దేశవ్యాప్తంగా హేయమైన, తీవ్రమైన నేరాలు, రెచ్చగొట్టే హింసకు దారి తీసే వాట్సప్ సందేశాలను గుర్తించాల్సి ఉంది..’ అని చెప్పారు.