పాక్‌ భూభాగంలో అభినందన్ పడిపోయాక.. ఏం జరిగిందో తెలుసా?: పాక్ పత్రిక సంచలన కథనం!

12:24 pm, Thu, 28 February 19
indian pilot

indian pilot2

ముజఫరాబాద్: పాకిస్థాన్‌లోని ప్రముఖ వార్తాపత్రిక ‘డాన్’ భారత పైలట్ అభినందన్ వర్థమాన్‌కు సంబంధించి ఓ వార్తను ప్రచురించింది. అభినందన్‌ను అదుపులోకి తీసుకునే ముందు జరిగిన పరిణామాలు ఇవేనని చెప్పుకొచ్చింది. ‘డాన్’ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎల్‌ఓసీకి సరిగ్గా 7కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటి సమీపంలో బుధవారం ఉదయం 8:45 నిమిషాల సమయంలో రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లు మంటల్లో కాలిపోవడం తాను చూశానని 58 ఏళ్ల వయసున్న మహ్మద్ రజాక్ తెలిపినట్లు ‘డాన్’ పత్రిక రిపోర్ట్ చేసింది.

కాలిపోతున్న ఓ విమానం నుంచి పారాచ్యూట్‌లో ఓ వ్యక్తి తన ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో కిందకు దిగడం తాను చూశానని చెప్పుకొచ్చారు. గ్రామంలోని కొందరు యువకులను వెంట తీసుకెళ్లి అక్కడికి వెళ్లి చూడగా ఓ పైలట్ కనిపించినట్లు మహ్మద్ రజాక్ తెలిపాడు. యువకులను అతని దగ్గరకు వెళ్లవద్దని, సైన్యం వచ్చే దాకా వేచి చూద్దామని తాను చెప్పినట్లు మహ్మద్ రజాక్ తమ పత్రికకు ఫోన్‌లైన్‌లో తెలిపినట్లు ‘డాన్’ పత్రిక చెప్పుకొచ్చింది. తాను వెళ్లిన సమయంలో కొన్ని డాక్యుమెంట్లను, మ్యాప్‌లను మింగేందుకు ఆ పైలట్ ప్రయత్నించాడని రజాక్ చెప్పినట్లు తెలిసింది.

ఇండియా జిందాబాద్…

iaff, newsxpress.online

పిస్టల్ చేతబుచ్చుకున్న ఆ పైలట్ ‘ఇది ఇండియానా లేక పాకిస్థానా’ అని స్థానిక యువకులను అడిగినట్లు రజాక్ చెప్పాడు. ఆ యువకుల్లో ఓ యువకుడు తెలివిగా వ్యవహరించి ‘ఇది ఇండియా’ అని అబద్ధం చెప్పాడని రజాక్ చెప్పినట్లు ‘డాన్’ పత్రిక చెప్పుకొచ్చింది. దీంతో పైలట్ అభినందన్ ‘ఇండియా జిందాబాద్’ అని నినాదాలు చేశారట.

దాహంగా ఉందని, నీళ్లు ఇవ్వాలని అభినందన్ కోరినట్లు తెలిసింది. అభినందన్‌ ఇండియాకు చెందిన వ్యక్తి అని తెలుసుకున్న కొందరు యువకులు ‘పాకిస్థాన్ ఆర్మీ జిందాబాద్’ అని నినాదాలు చేశారట. దీంతో.. వారు తనపై ఎక్కడ దాడి చేస్తారో అని అభినందన్ తన వద్దనున్న పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు జరిపినట్లు ‘డాన్’ పత్రిక చెబుతోంది. ఈ పరిణామంతో కంగుతిన్న యువకులు అభినందన్‌పై విసిరేందుకు రాళ్లు చేతిలోకి తీసుకున్నారట.

దీంతో.. వారినుంచి తప్పించుకునే క్రమంలో అభినందన్ దాదాపు అర కిలోమీటరు వెనక్కి పరిగెత్తాడని, తనను వెంబడించిన యువకులకు పిస్టల్ చూపించి భయపెట్టాడని రజాక్ తమకు చెప్పినట్లు ‘డాన్’ పత్రిక వెల్లడించింది. ఈ పెనుగులాటలో అభినందన్ మరోసారి గాల్లోకి కాల్పులు జరిపాడట. జేబులో నుంచి కొన్ని డాక్యుమెంట్లను తీసి నీటిలో ముంచి నాశనం చేసే ప్రయత్నం కూడా చేశాడట.

అంతేకాదు, చేతిలోని పిస్టల్ కింద పడేయాలని ఆ యువకులు హెచ్చరికలు చేయగా.. అభినందన్ ఓ యువకుడిని కాలిపై కాల్చాడని కూడా ‘డాన్’ పత్రిక చెప్పుకొచ్చింది. అయితే.. ఇందులో నిజమెంత అనే విషయంలో స్పష్టత లేదు. ఎట్టకేలకు పిస్టల్ కింద పడేసిన పైలట్ అభినందన్‌ను పాక్ యువకులు చుట్టుముట్టారని.. వారు కోపంతో అతనిపై దాడి కూడా చేశారని.. ఈలోగా పాక్ సైన్యం వచ్చి అభినందన్‌ను కాపాడిందని ‘డాన్’ పత్రిక తన కథనంలో పేర్కొంది.

సంబంధిత వార్తలు