
కేరళ : కేరళలో గతేడాది నిఫా వైరస్ సృష్టించిన అలజడి ఇంకా మరువకముందే, తాజాగా మరో సారి వెస్ట్ నైల్ వైరస్ ప్రజలలో భయాందోళనలు రేకతిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే మలప్పురం జిల్లాకు చెందిన ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. కోజికోడ్ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న ఆ బాలుడికి పరీక్షలు నిర్వహించగా వెస్ట్ నైల్ వైరస్ పాజిటివ్‌గా తేలింది.
ఏడేళ్ల బాలుడు మృతి …
దీనితో అక్కడి వైద్యులకు సహాయం అందించడానికి ఎన్సీడీసీ గురువారం ఓ ప్రత్యేక వైద్యుల బృందాన్ని కేరళకు పంపింది. కానీ, ఆ వైద్యుల బృందం ప్రయత్నాలు ఫలించకపోవడంతో, సోమవారం ఆ బాలుడు తుదిశ్వాస విడిచాడు. ఈ వెస్ట్ నైల్ వైరస్‌ను తొలుత 1937లో యుగాండాలో కనుగొన్నారు.
ఈ వైరస్ ఎక్కువగా దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది అని తెలుస్తోంది.మాములుగా ఉత్తర అమెరికాలో ఎక్కువగా వెస్ట్ నైల్ వైరస్ కేసులు నమోదు అవుతాయి. ఈ వైరస్ బారిన పడినవారిలో జ్వరం, తలనొప్పి, వాంతులు, ఒళ్లు నొప్పులు, కొన్ని సందర్భాల్లో దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ నివారించడానికి ఇప్పటివరకు ఎటువంటి మందు లేదు.
దోమలకు దూరంగా ఉండటం ద్వారా ఈ వైరస్ బారిన పడకుండా ఉండచ్చు అంతే తప్ప వైరస్ కి సరైన మందు కనిపెట్టలేదు. ఈ వెస్ట్ నైల్ వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని మలప్పురం జిల్లా వైద్యాధికారి తెలిపారు. అలాగే ఉత్తర మలబార్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు.








