న్యూఢిల్లీ: భారత్ మరో ఘనతను సాధించింది. ‘మిషన్ శక్తి’ని విజయవంతంగా పరీక్షించటం ద్వారా అంతరిక్ష శక్తిగా రూపాంతరం చెంది అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన చేరింది. భారత శాస్తవ్రేత్తలు రూపొందించిన ఏ-శాట్ (ఉపగ్రహ వ్యతిరేక క్షిపణ) బుధవారం అంతరిక్షంలోని 300 కిలోమీటర్ల దూరంలో తక్కువ కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని ధ్వంసం చేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం మధ్యాహ్నం జాతి నుద్దేశించి ప్రసంగిస్తూ ఈ కీలక విషయాన్ని స్వయంగా ప్రకటించారు. భారతదేశం జరిపిన ‘మిషన్ శక్తి’ విజయవంతమైందని ఆయన ప్రకటించారు. అలాగే అంతరిక్షంలోని ఉపగ్రహాన్ని పడగొట్టగలిగే ఈ శక్తి.. ఇతర ఏ దేశానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
మిషన్ శక్తిని విజయవంతం చేసిన శాస్తవ్రేత్తలను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. అంతరిక్షంలో ఉపగ్రహాలను పడగొట్టగలిగే లేదా ధ్వంసం చేయగలిగే శక్తి, సామర్థ్యాలు ప్రస్తుతం కేవలం అమెరికా, రష్యా, చైనా దేశాలకు మాత్రమే ఉంది. తాజాగా మన దేశం కూడా ఇప్పుడు ఈ అగ్ర దేశాల సరసన చేరింది.
అంతరిక్షంలో 300 కిలోమీటర్ల దూరంలో తిరుగుతున్న లో ఆర్బిట్ ఉపగ్రహాన్ని ఏ-క్షిపణి (ఉపగ్రహ వ్యతిరేక క్షిపణి) కేవలం మూడు నిమిషాల్లో ధ్వంసం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. భారతదేశం భద్రత, ఆర్థికాభివృద్ధి, సాంకేతికాభివృద్ధికి ‘మిషన్ శక్తి’ అతిముఖ్యమైన అడుగని ఆయన అన్నారు.
An important message to the nation. Watch. https://t.co/0LEOATgOOQ
— Narendra Modi (@narendramodi) March 27, 2019
‘‘మన శాస్త్ర్రవేత్తలు అద్భుతం చేశారు…’’
‘‘భారత శాస్త్ర్రవేత్తలు కొన్ని నిమిషాల ముందు అద్భుతం చేశారు. అంతరిక్షంలో తక్కువ కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని క్షిపణి ద్వారా ధ్వంసం చేశారు. ఈ ప్రయోగంతో ఈ రకమైన అంతరిక్ష శక్తి ఉన్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది..’’ అంటూ నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రకటించారు.
ఇంతవరకు ప్రపంచంలో కేవలం మూడు దేశాలు- అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే అంతరిక్షంలోని శతృ దేశాల ఉపగ్రహాలను ధ్వంసం చేసే శక్తి ఉంది.. భారతదేశం ఈ రోజు మిషన్ శక్తిని విజయవంతం చేయటం ద్వారా ఈ దేశాల సరసన చేరిందని ఆయన చెప్పారు.
కేవలం మూడు నిమిషాల్లో ఉపగ్రహాన్ని ధ్వంసం చేయడం పూర్తి చేశారని ఆయన తెలిపారు. ‘మిషన్ శక్తి’ అత్యంత కఠినమైన చర్య.. ఇలాంటి చర్యకు అత్యంత ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానం అవసరమవుతుంది. మన శాస్తవ్రేత్తలు ముందు నిర్ధారించిన లక్ష్యాలను ఈ చర్యలో సాధించారని మోడీ ప్రకటించారు.
ఈ ఉపగ్రహ వ్యతిరేక క్షిపణి సామర్థ్యాన్ని భారతదేశంలోనే అభివృద్ధి చేసి విజయవంతంగా ప్రయోగించటం పట్ల భారత పౌరులందరూ గర్వపడాలని ఆయన చెప్పారు. ‘‘మనమిప్పుడు భూమి, ఆకాశం, సముద్ర జలాలతో పాటు అంతరిక్షంలో మనల్ని మనం కాపాడుకోగలిగే స్థాయికి ఎదిగాం..’’ అంటూ మోడీ గర్వంగా చెప్పారు.
అంతరిక్షం ఇప్పుడు మన జీవన విధానంలో ఒక భాగంగా మారింది. మనవద్ద అవసరమున్నన్ని ఉపగ్రహాలున్నాయి. ఇవి వివిధ రంగాల్లో మనకు అమూల్యమైన సేవలు అందిస్తున్నాయి. వ్యవసాయం, భద్రత, రక్షణ, ప్రకృతి వైపరీత్యాలు, సమాచారం, కమ్యూనికేషన్లు, వినోదం, టీవీ, పర్యావరణం, నావిగేషన్, విద్య, వైద్యం తదితర రంగాల్లో ఉపగ్రహాల సేవలను అందుకుంటున్నాం.. అని ఆయన వివరించారు.
రైల్వే, విమానయానం, నౌకాయానం తదితర అన్ని రంగాల్లో ఉపగ్రహాలను ఉపయోగించుకోవడం జరుగుతోందన్నారు. అంతరిక్షం, ఉపగ్రహాల ప్రయోగం రోజురోజుకూ పెరుగుతోందని, ఇవి లేకుండా ఉండగలిగే రోజులు కనిపించటం లేదని, అందుకే ఉపగ్రహాలు, అంతరిక్షాన్ని కాపాడుకోవలసిన అవసరం కూడా పెరుగుతోందని మోడీ వివరించారు.
అంతరిక్షం, ఉపగ్రహాల భద్రత కోసం ‘మిషన్ శక్తి’ ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని తెలిపారు. దేశాభివృద్ధి, రక్షణ రంగం పటిష్ఠానికి ఏ-శాట్ క్షిపణి కొత్త దశ, దిశను నిర్ధారిస్తుందని మోడీ ప్రకటించారు. ‘మిషన్ శక్తి’ సామర్థ్యం ప్రపంచంలోని ఏ ఇతర దేశానికి వ్యతిరేకం కాదనే విశ్వాసాన్ని ప్రపంచ ప్రజలకు కల్పిస్తున్నానని నరేంద్ర మోడీ తెలిపారు.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం తన భద్రత కోసం చేసుకున్న ఒక ఏర్పాటు.. ఈ ‘మిషన్ శక్తి’ అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, భారతదేశం మొదటి నుండి అంతరిక్షంలో ఆయుధాల నిల్వను వ్యతిరేకిస్తోందని, మిషన్ శక్తి తరువాత కూడా తమ ఈ విధానంలో ఎలాంటి మార్పు రాదని ప్రధాని ప్రకటించారు.
ఈ రోజు నిర్వహించిన మిషన్ శక్తి పరీక్ష.. అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలను ఉల్లంఘించటం కాదని ఆయన స్పష్టం చేశారు. మిషన్ శక్తిని దేశంలోని 130 కోట్ల మంది ప్రజల భద్రత, అభ్యున్నతి కోసం మాత్రమే ఉపయోగిస్తామని స్పష్టం చేశారు.
అంతరిక్షంలో శాంతి నెలకొనేందుకు పటిష్టమైన భారతదేశం ఎంతో అవసరం. శాంతిని కొనసాగించటమే తప్ప యుద్ధ వాతావరణాన్ని సృష్టించటం భారతదేశం లక్ష్యం కాదని మోడీ అన్నారు. అభివృద్ధి చెందుతూ భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండటమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.
దేశ ప్రజలు సురక్షితంగా ఉండటమే తమ లక్ష్యమన్నారు. భవిష్యత్తు గురించి ముందే అంచనా వేసి దాని ప్రకారం ముందుకు సాగిపోగలిగే శక్తిని దేశం, ప్రజలకు కలిగించటమే తన లక్ష్యమని నరేంద్ర మోడీ ప్రకటించటంతోపాటు ‘భారత్ మాతాకీ జై’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
విపక్షాల విమర్శలు.. పరిశీలిస్తామన్న ఎన్నికల సంఘం…
అయితే, లోక్‌సభతోపాటు కొన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ‘మిషన్ శక్తి’ విజయవంతం కావటం గురించి.. జాతి నుద్దేశించి ప్రకటించటం ద్వారా వివాదానికి తెరలేపినట్లయింది. దీనిపై విపక్షాలు కూడా విమర్శలు ఎక్కుపెట్టాయి. ఎన్నికల సంఘం పరిశీలిస్తామని పేర్కొంది.
అమెరికా హెచ్చరికకు భారత్ జవాబు…
‘మిషన్ శక్తి’ నేపథ్యంలో అమెరికా హెచ్చరికకు భారత్ సమాధానం చెప్పింది. కాగా, భూ ఉపరితలానికి దాదాపు 300 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లైవ్ శాటిలైట్‌ను విజయవంతంగా ధ్వంసం చేయడం ద్వారా ‘అంతరిక్ష యుద్ధం’ చేయగల సత్తా ఉన్న అమెరికా, రష్యా, చైనాలతో సమానంగా ఇండియా నిలిచిన వేళ, అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.
ఇండియా మాదిరిగా యాంటీ శాటిలైట్ వెపన్స్‌ను వాడుతూ అంతరిక్షంలో గందరగోళం సృష్టించవద్దని యూఎస్ తాత్కాలిక రక్షణ మంత్రి పాట్రిక్ షనాహన్ వ్యాఖ్యానించారు. ధ్వంసమైన శాటిలైట్ల శకలాల విషయమై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
“నేను చెప్పేదేంటంటే… మనమంతా అంతరిక్షంలో భాగంగానే ఉన్నాము. దీన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ కార్యకలాపాలను అంతరిక్షంలో సాగించుకునే అవకాశాలు ఉండాలి..” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇండియా ప్రయోగం తరువాత అంతరిక్షంలో మిగిలిన శాటిలైట్ శకలాల గురించి మాత్రం ఆయన ప్రస్తావించలేదు. ఈ పరీక్షను తాము అధ్యయనం చేస్తున్నామని, ఎవరికీ అంతరిక్షాన్ని అస్థిరపరిచే హక్కు లేదని మాత్రం అన్నారు. అయితే యాంటీ శాటిలైట్ పరీక్షలతో శకలాల సమస్యను మరింత పెంచవద్దని మాత్రం కోరారు.
‘‘శకలాల సమస్య ఎంత మాత్రమూ లేదు..’’
మరోవైపు మిషన్ శక్తి ప్రయోగం కారణంగా శాటిలైట్ శకలాల సమస్య ఎంత మాత్రమూ లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తాజా పరీక్షలో దాదాపు 300 కిలోమీటర్ల ఎత్తులోని ఉపగ్రహాన్ని ఎంచుకున్నామని భారత శాస్త్రవేత్తలు తెలిపారు. దీని శకలాల వల్ల ఇతర ఉపగ్రహాలకు నష్టం లేకుండా జాగ్రత్తలు వహించామన్నారు. కొద్దిరోజులకు ఆ శకలాలు భూ వాతావరణంలోకి జారిపోయి మండిపోతాయని చెప్పారు.
అలాగే ఈ పరీక్షను కేవలం వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ను మరింత భద్రంగా ఉంచే చర్యల్లో భాగంగానే చేపట్టినట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచ శాంతికి ఈ ప్రయోగం వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లదని కూడా ఆయన స్పష్టం చేశారు. విలువైన అంతరిక్ష ఆస్తులను కాపాడుకోవడం తమ బాధ్యతని చెప్పారు.








