
ముజఫర్‌నగర్ (యూపీ): కరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతుండడంతో కార్యకలాపాలన్నీ ఎక్కడివక్కడ స్తంభించిపోయాయి.
ఈ నేపథ్యంలో ఎలాగైనా వివాహం చేసుకోవాలని నిర్ణయించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడు తండ్రితో కలిసి అద్భుతమైన ప్లాన్ వేసినా చివరికి దొరికిపోయాడు.
ప్రస్తుతం అతడి కుటుంబం మొత్తం నిర్బంధంలో ఉంది. ముజఫర్‌నగర్‌కు చెందిన అహ్మద్ ఢిల్లీ వెళ్లేందుకు అంబులెన్స్ బుక్ చేసుకున్నాడు.
తండ్రికి సెలైన్ ఎక్కించి అంబులెన్స్‌లో పడుకోబెట్టాడు. వెళ్లే దారిలో అనేక చెక్‌పోస్టులను దాటి మొత్తానికి ఢిల్లీ చేరుకున్నాడు.
అక్కడ గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుని మంగళవారం తిరిగి అంబులెన్స్‌లో ఇంటికి చేరుకున్నాడు.
అయితే, ఆ ఇంటికి కొత్త వధువు వచ్చిన ఆనందం ఎంతోసేపు నిలవలేదు.
చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అహ్మద్ నివసిస్తున్న ఖతౌలీ ప్రాంతం కరోనా హాట్‌స్పాట్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించారు.
ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఇస్లాం నగర్‌లోని అహ్మద్ ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులందరి నమూనాలు సేకరించారు. అందరినీ 14 రోజులపాటు క్వారంటైన్‌కు ఆదేశించారు.
పోలీసుల కథనం ప్రకారం.. అహ్మద్ నాలుగు రోజుల క్రితమే ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నించాడు. తండ్రి ఇస్రార్‌తో కలిసి అప్పర్ గంగా కాలువ మీదుగా వెళ్లేందుకు యత్నించాడు.
గుర్తించిన పోలీసులు వారిని వెనక్కి పంపారు. దీంతో ఈసారి పోలీసులకు పట్టుబడకుండా ఢిల్లీ వెళ్లేందుకు మరో ప్లాన్ వేశాడు. అంబులెన్స్ అద్దెకు తీసుకున్నాడు.
అహ్మద్ తండ్రి ఇస్రార్ సెలైన్ ఎక్కించుకున్నట్టు నటిస్తూ అంబులెన్స్ ఎక్కాడు. అలా పోలీసులకు దొరక్కుండా ఢిల్లీ చేరుకున్న అహ్మద్ ‘నిఖా’ చేసుకున్నాడు.
అనంతరం అదే అంబులెన్స్‌లో తిరిగి ముజఫర్‌నగర్ చేరుకున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, అంబెలెన్స్ డ్రైవర్ మెహతాబ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.








