ఇదేనా ఆదర్శం?: మద్యం తాగుతూ తుపాకులు చేతబట్టి.. చిందేసిన బీజేపీ ఎమ్మెల్యే!

4:25 pm, Wed, 10 July 19
uttarakhand-bjp-mla-dancing-with-guns

డెహ్రాడూన్: ఆయన ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి. కానీ తన అనచరులతో కలిసి మద్యం సేవిస్తూ.. విచక్షణ మరచి, చేతిలో తుపాకులు ప్రదర్శిస్తూ ఓ బాలీవుడ్ పాటకు చిందేశారు. ఆ గదిలో తనతోపాటు చుట్టూ ఉన్న తన మద్దతుదారులను చూస్తూ, నృత్యం చేస్తూ.. కాసేపు హల్‌చల్ చేశారు.

అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆ ప్రజాప్రతినిధి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అసలేం జరిగిందంటే…

ఉత్తరాఖండ్‌ హరిద్వార్-ఖాన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే కున్వర్‌ ప్రణవ్‌ సింగ్‌ చాంపియన్ తీరు ఆదినుంచీ వివాదాస్పదమే.

తన వివాదాస్పద చర్యలతో ఈయన తరచూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. ఇప్పటికే క్రమశిక్షణ ఉల్లంఘన, అసభ్య ప్రవర్తన కారణంగా పార్టీ నుంచి సస్పెండ్ అయినా అతడు తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు.

దీనికి తాజా ఉదాహరణ ఇదే. ఈ మధ్యే కాలికి సర్జరీ చేయించుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సందర్భంగా.. డెహ్రాడూన్‌లోని ఓ లాడ్జి గదిలో తన అనుచరులతో కలిసి పార్టీ చేసుకున్నారు.

పూటుగా మద్యం సేవించిన కున్వర్‌ ప్రణవ్‌ సింగ్‌.. ఆ జోష్‌లో ఒకటి కాదు రెండు కాదు.. నాలుగైదు తుపాకులను తన రెండు చేతిల్లో పట్టుకుని ప్రదర్శిస్తూ.. అసభ్య పదజాలం వాడుతూ ఓ బాలీవుడ్ పాటకు చిందేశాడు.

ఇప్పటికే మూడుసార్లు పార్టీ నుంచి ఔట్.. అయినా…

ప్రజాప్రతినిధిగా బాధ్యతతో మెలగాల్సిన ప్రణవ్ సింగ్‌ చాంపియన్ ఇదివరకు ఎన్నో వివాదాల్లో కేంద్ర బిందువుగా మారారు. దీంతో బీజేపీ అధిష్ఠానం ఆయనపై ఇప్పటికే మూడుసార్లు బహిష్కరణ వేటు వేసింది.

కొద్ది నెలల కిందట ఓ జర్నలిస్టును చంపేస్తానంటూ ప్రణవ్ సింగ్ బెదిరించిన వీడియో ఒకటి బయటకొచ్చింది. అప్పుడు కూడా పార్టీ హైకమాండ్ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్‌కు మొట్టికాయలు వేసింది.

ఇప్పుడు మళ్లీ తాజాగా ఆయన మందేసి చిందేస్తూ తుపాకులు చేతబట్టి హల్‌చల్ చేసిన వ్యవహారం వెలుగుచూడటంతో పార్టీ పెద్దలు మరోసారి ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే మూడుసార్లు పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ప్రణవ్ సింగ్‌పై ఈసారి ఎలాంటి క్రమశిక్షణ చర్య తీసుకుంటారో మరి.

ఇంతకీ అవి లైసెన్స్‌డ్ తుపాకులేనా?

మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే కున్వర్‌ ప్రణవ్‌ సింగ్‌ తాజా నిర్వాకంపై పోలీసులు కూడా స్పందించారు. ఆ వీడియోలో ప్రణవ్ సింగ్ చేతిలో ఉన్న ఆ తుపాకులకు లైసెన్సు ఉందా? లేదా? అనే విషయాలను వారు ఆరాతీస్తున్నారు. ఇక నెటిజన్లు అయితే ప్రణవ్ సింగ్ నిర్వాకాన్ని తమ కామెట్లతో తూర్పారపడుతున్నారు.

ఎమ్మెల్యే అయి ఉండీ.. మందు తాగుతూ తన అనుచరులతో కలిసి చిందేస్తూ తుపాకులు చేతబట్టి ఐటమ్ సాంగ్‌కు డ్యాన్స్ చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బాధ్యత కలిగిన ఓ ప్రజా ప్రతినిధి ఇలా చేస్తే సమాజానికి ఎలాంటి మేసేజ్ వెళుతుంది? ఆయనకు అసలు ఇంగీత జ్ఞానం అనేది ఉందా అనే కామెంట్లు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి.