పెరుగుతున్న దేశ ప్రజల సగటు ఆయుర్దాయం.. ఎక్కువ కాలం జీవించేది మహిళలే!

- Advertisement -

న్యూఢిల్లీ: 2031-35 నాటికి దేశ ప్రజల సగటు ఆయుర్దాయం 72.41 ఏళ్లకు చేరుకోనున్నట్టు కేంద్ర గణాంకశాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక పేర్కొంది.

‘దేశంలో మహిళలు, పురుషులు-2020’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో మహిళల సగటు ఆయుర్దాయాన్ని 74.66 ఏళ్లుగా పేర్కొనగా, పురుషుల సగటున 71.17 ఏళ్లు జీవిస్తారని పేర్కొంది.

2014-18తో పోలిస్తే సగటు ఆయుర్దాయం పెరగడం గమనార్హం. అప్పట్లో ఇది 69.6 ఏళ్లుగా నమోదైంది. మరోవైపు, గత పదేళ్లలో దేశంలో జనాభా పెరుగుదల రేటు 1.6 శాతం నుంచి 1.1 శాతానికి తగ్గినట్టు నివేదిక వివరించింది.

గతంలో పోలిస్తే లింగ నిష్పత్తి కూడా స్వల్పంగా మెరుగుపడింది. 2011లో ప్రతి వెయ్యిమంది పురుషులకు 943 మంది మహిళలు ఉంటే ప్రస్తుతం ఈ సంఖ్య 948కి పెరిగింది.

పట్టణాల విషయానికి వస్తే ప్రతి వెయ్యిమంది పురుషులకు 929 మంది మహిళలు ఉన్నారు.

అదే సమయంలో గ్రామాల్లో మాత్రం ఈ సంఖ్య 949 నుంచి 958కి పెరిగింది. తెలంగాణలో 2018 నాటికి లింగ నిష్పత్తి 924గా ఉండగా, గత నాలుగేళ్లుగా ఇది క్రమంగా మెరుగుపడుతోంది.

అలాగే, మహిళల సగటు వివాహ వయసు 22.1 ఏళ్ల నుంచి 22.3 ఏళ్లకు చేరుకున్నట్టు తాజాగా గణాంకాలు చెబుతున్నాయి.

- Advertisement -