ఉగ్రవాదుల ఘాతుకం.. జమ్మూకశ్మీర్‌లో సర్పంచ్ దారుణ హత్య

- Advertisement -

అనంత్‌నాగ్: జమ్ముకశ్మీర్‌లో దారుణం చోటుచేసుకుంది. స్థానిక గ్రామానికి చెందిన ఓ సర్పంచ్‌ను ఉగ్రవాదులు పాశవికంగా కాల్చి చంపారు.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అనేక మంది రాజకీయ నాయకులు ఉగ్రవాదుల చర్యలు తీవ్రంగా ఖండించారు.

వివరాల్లోకి వెళితే.. స్థానిక అనంత్‌నాగ్‌లోని లర్కిపొర ప్రాంతంలో లక్‌భవన్‌ గ్రామానికి అజయ్ పండిత భారతి(40) సర్పంచ్‌గా ఉన్నారు.

అయితే సోమవారం ఆయన తన ఇంటి సమీపంలో ఉండగానే దాడిని పాల్పడిన ఉగ్రవాదులు అతడిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

దీంతో తీవ్ర గాయాలపాలైన అజయ్‌ పండితను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, భద్రతా దళాలు ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

ఉగ్రవాదుల కోసం చుట్టు పక్కల ప్రాంతాలన్నీ గాలించినప్పటికీ వారి జాడ తెలియరాలేదు. 

ఇదిలా ఉంటే సర్పంచ్ కాల్చివేతను స్థానిక రాజకీయనాయకులు తీవ్రంగా ఖండించారు.

అజయ్ పండిత హత్య తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు.

ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇతిజా ముఫ్తీ తీవ్రవాదుల చర్యను ఖండించారు.

వీరితో పాటు జమ్ముకశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా, సోఫియా యూసుఫ్‌, తదితరులు ఈ ఘటనపై మండి పడ్డారు. హత్యకు పాల్పడిన వారిని తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -