స్టెరిలైట్ వివాదం: తూత్తుకుడిలో కొనసాగుతున్న ఉద్రిక్తత, ఇంటింటిని జల్లెడ పడుతున్న పోలీసులు!

- Advertisement -

చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడి ఇంకా తేరుకోలేదు.  అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. స్టెరిలైట్ కాపర్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజల ఆందోళన, పోలీసుల కాల్పులతో తూత్తుకుడి అట్టుడికిన సంగతి తెలిసిందే. స్టెరిలైట్ కాపర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన వారిని అదుపు చేయడంలో విఫలమైన పోలీసులు కాల్పులు జరపగా..  13 మంది వరకూ మరణించారు.

అయితే ప్రజలపై కాల్పులు జరిపేందుకు ఆదేశాలు ఇచ్చింది తమిళనాడు డీజీపీ రాజేంద్రన్ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు తూత్తుకుడి జిల్లా కలెక్టర్‌గా కొత్తగా బాధ్యతల్లోకి వచ్చిన సందీప్ నండూరి మాట్లాడుతూ… తన మొదటి ప్రాధాన్యం తూత్తుకుడిలో సాధారణ పరిస్థితులు నెలకొల్పడమేనన్నారు. కాల్పులకు ఆదేశాలు ఇచ్చింది ఎవరన్నది తమిళనాడు ప్రభుత్వం నియమించిన జడ్జి విచారణలో తేలుతుందని చెప్పారు.

మరోవైపు తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ కు విద్యుత్తును నిలిపివేయాలని తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి గురువారం ఆదేశించింది. ఇక ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకోగా, అది బుధవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చింది. గురువారం పోలీసులు తూత్తుకుడిలో ఇంటింటికీ  వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చిన యువకులను వారు అదుపులోనికి తీసుకుంటున్నట్లు సమాచారం.

పోలీసుల వైఖరి అమానుషం…

తూత్తుకుడి స్టెరిలైట్ కాపర్ ప్లాంట్‌ను మూసివేయాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది.  ఆందోళనకారుల పట్ల పోలీసులు ఎంత నిర్దయగా వ్యవహరిస్తున్నారో తెలియజెప్పే ఓ వీడియో తాజాగా తెర పైకి వచ్చింది. బుధవారం నాటి కాల్పుల్లో ‘కాలియప్పన్’ (22) అనే వ్యక్తి తుపాకీ తూటాకి కుప్పకూలగా ఆ సమయంలో పోలీసుల ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాలియప్పన్ కుప్పకూలిన తర్వాత కొంతమంది పోలీసులు అతని చుట్టు గుమిగూడారు. కింద పడి ఉన్న అతన్ని లాఠీలతో పొడుస్తూ.. ‘నటించి చాలు.. ఇక లేచి వెళ్లు’ అంటూ కామెంట్ చేశారు. పక్కనున్న మిగతా పోలీసులు కూడా ‘అతను నటిస్తున్నాడు..’ అంటూ కామెంట్ చేశారు.  కానీ కాలియప్పన్‌ను ఆసుపత్రికి తరలించేసరికే అతను మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు మాత్రం.. ఆందోళనకారులు రాళ్లు రువ్విన తర్వాతే తాము కాల్పులు  చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. కాగా, మరో ఏఎన్ఐ విడుదల చేసిన మరో వీడియోలోనూ పోలీసుల ప్రవర్తన అత్యంత వివాదాస్పదంగా జరపాల్పి వచ్చిందని చెబుతున్నారు.

ఆందోళనకారులపై కాల్పులు జరిపేందుకు ఓ బస్సు పైకి ఎక్కిన పోలీసు తుపాకీ గురిపెట్టగా.. ‘కచ్చితంగా ఒక్కడైనా చస్తాడు..’ అన్న గొంతు ఆ వీడియోలో వినిపించింది. మరోవైపు తీవ్ర ఆందోళనల నేపథ్యంలో ఐదు రోజుల పాటు అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది ప్రభుత్వం. ఆందోళనకారులు మాత్రం స్టెరిలైట్ ఫ్యాక్టరీని మూసివేసే వరకు తమ పోరాటం ఆగే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఫ్యాక్టరీ వల్ల చుట్టుపక్కల గ్రామాల్లోని నీళ్లు, గాలి పూర్తిగా కలుషితమై క్యాన్సర్ వ్యాప్తి చెందుతోందని వారు వాపోతున్నారు.

- Advertisement -