
చెన్నై: వివాహేతర సంబంధం కొనసాగించాలని ఒత్తిడి చేసిన మాజీ ప్రియుడిని ఓ బుల్లితెర నటి దారుణంగా హత్య చేసింది. ఈ కేసులో ఆమెతోపాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బుల్లితెర నటి దేవి తన భర్త శంకర్‌తో కలిసి తమిళనాడులోని వడపళనిలో నివసిస్తోంది.
సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో పదేళ్ల క్రితం చెన్నై వచ్చిన మధురైకి చెందిన రవి (38)తో దేవికి పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయం కొంతకాలానికి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే, ఇటీవల అతడి నుంచి దూరంగా జరగాలని భావించిన దేవి అతనికి తెలియకుండా కొలత్తూరు సెమాత్తమన్ కోవిల్ వీధికి మారిపోయింది. టీవీలో అవకాశాలు తగ్గడంతో టైలరింగ్ చేస్తూ జీవిస్తోంది.
దేవి కనిపించకపోవడంతో ఆమె కోసం వెతికిన రవి ఎలాగోలా ఆమె చిరునామా కనుక్కున్నాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి దేవి చెల్లెలు లక్ష్మీ ఇంటికి వెళ్లిన రవి ఆమెతో గొడవ పడ్డాడు. విషయం తెలిసిన దేవి భర్తతో కలిసి వెంటనే అక్కడికి వచ్చింది. రవితో గొడవకు దిగింది. వెంటనే అక్కడినుంచి వెళ్లిపోవాలని కోరింది. దీంతో కోపంతో ఊగిపోయిన రవి వారితో వాగ్వాదానికి దిగాడు.
ఈ క్రమంలో కోపం పట్టలేని దేవి ఇనుప రాడ్డుతో రవిపై దాడి చేసింది. మరోవైపు, శంకర్ కూడా కర్రతో అతడిని చితకబాదాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులు దేవి, ఆమె భర్త శంకర్, సోదరి లక్ష్మి, ఆమె భర్తసావరీస్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.








