
చెన్నై: పెరియార్ గురించిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా తన నివాసానికి ఏర్పాటు చేయదలచిన అదనపు పోలీసుల భద్రతను రజనీకాంత్ నిరాకరించారు. నగరంలో కొన్ని రోజుల క్రితం జరిగిన తుగ్లక్ పత్రిక వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్ తందై పెరియార్ నేతృత్వంలో ద్రావిడ కళగం నిర్వహించిన ఊరేగింపులో హిందూ దేవతల విగ్రహాలను అవమానించినట్టు అప్పటి పత్రికలు కథనాలు ప్రచురించాయని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్య లను తీవ్రంగా పెరియార్ ద్రావిడర్ కళగం సహా పలు సంస్థలు రజనీని ఖండిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. పోయస్ గార్డెన్‌లో ఉన్న రజనీకాంత్ ఇంటిని ముట్టడించే ప్రయత్నాలకు దిగారు. అందువల్ల ఆ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేలా సూపర్‌స్టార్ ఇంటి ముందు పోలీసు భద్రత ఏర్పాటైంది.
ఈ నేపథ్యంలో, రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం అధికారి తిరునావుక్కరసు శనివారం ఉదయం రజనీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించారు. అప్పుడు తన కోసం కల్పించిన భద్రతను వాపసు తీసుకోవాలని రజనీ కోరారు. అయినప్పటికీ, భద్రతా విధుల్లో పాల్గొంటున్న ఐదుగురు కానిస్టేబుళ్లలో ఇద్దరిని విడిపించి, మిగతా ముగ్గురి తో భద్రత కల్పిస్తూ తిరునావుక్కరసు ఉత్తర్వులు జారీ చేశారు.








