సుప్రీంకోర్టులో మోడీ సర్కారుకు షాక్.. అలోక్ వర్మను మళ్లీ సీబీఐ డైరెక్టర్‌గా నియమించాలంటూ ఆదేశం

supreme-court-alok-varma
- Advertisement -

supreme-court-alok-varma

న్యూఢిల్లీ: సీబీఐ వివాదంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెల్లడించింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మను సెలవుపై పంపడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీనికి సంబంధించి మోడీ సర్కారు జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొట్టివేస్తూ.. ఆయన్ని తిరిగి సీబీఐ డైరెక్టర్‌గా నియమించాలని ఆదేశించింది.

అలోక్ వర్మను మళ్లీ విధుల్లోకి చేర్చుకోవాలంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం ఆయనకు అతి పెద్ద విజయంకాగా, మోడీ సర్కారుకు ఇది చెంపపెట్టు లాంటిది. సీబీఐ డైరెక్టర్‌పై చర్యలు తీసుకునేముందు అపాయింట్‌మెంట్ కమిటీని ప్రభుత్వం సంప్రదించి ఉంటే బాగుండేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆరోపణలు ఉన్నంత మాత్రాన అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తప్పించి సెలవుపై పంపించడం సరైన చర్య కాదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

అయితే అలోక్ వర్మపై ఆరోపణలు ఇంకా తొలగిపోలేదని, ఆయన సీబీఐ డైరెక్టర్‌గా తిరిగి చేరినా.. ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు రుజువు అయ్యేంత వరకు ఆయనే సీబీఐ డైరెక్టర్‌గా కొనసాగుతారని, ఈ దిశగా కేంద్రం అవసరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.

- Advertisement -