22.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ అలాగైనా, ఇలాగైనా వైసీపీకే లాభం!? అదే ధీమాలో వైఎస్ జగన్…

అలాగైనా, ఇలాగైనా వైసీపీకే లాభం!? అదే ధీమాలో వైఎస్ జగన్…

jagan-analysis-on-janasena
- Advertisement -

Pawan-Jagan-chandrababu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందనే ధీమాలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉన్నారు. జనసేన పార్టీ విడిగా పోటీ చేసినా, ఒకవేళ టీడీపీతో కలిసినా అది తనకే కలిసొస్తుందని ఆయన భావిస్తున్నారు. దీనికి సంబంధించి జగన్ తనదైన శైలిలో ప్రణాళికలు రచిస్తున్నారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ముక్కోణపు పోటీయే జరిగే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇటు అధికార టీడీపీ, అటు ప్రతిపక్ష వైసీపీ, మరోవైపు జనసేన బరిలోకి దిగుతుండడంతో మూడు పార్టీల నడుమ హోరాహోరీ తప్పదని అర్థమవుతోంది.

అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. టీడీపీ, వైసీపీ, జనసేన.. పార్టీల్లో ప్రస్తుతానికి ఏ రెండు పార్టీలూ కలిపి పోటీ చేసే అవకాశం కనుచూపుమేరలో కానరావడం లేదు.

ఎవరికి వారే విడివిడిగా…

2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ 2019లో లెఫ్ట్ పార్టీలు మినహా, మరే ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా లేరు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈసారి ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే విజయం సాధిస్తుందనే ధీమాలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో జనసేనతో కలవాల్సిన అవసరం కూడా లేదనేది ఆయన భావన. మరోవైపు టీడీపీ జనసేనతో పొత్తుకు ప్రయత్నిస్తున్నా పవన్ కళ్యాణ్ అందుకు సిద్ధంగా లేరు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూడా ఒంటరిగానే తన బలాన్ని పరీక్షించుకోవాల్సి వస్తోంది.

పవన్ అలా చేస్తే వైసీపీకే లాభమా?

2014 ఎన్నికల్లోనూ వైసీపీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగింది. ఆ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు పలికారు. ప్రస్తుతం మూడు పార్టీలు ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగనున్న నేపథ్యంలో జనసేన ప్రభావంపై జగన్ తనదైన లెక్కలు వేసుకుంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఒంటరిగా పోటీ చేస్తే అది తమ పార్టీకి లాభిస్తుందని వ్యాఖ్యానించారు.

గత ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ను అభిమానించే వారు ఆయన టీడీపీకి మద్దతు పలకడంతో టీడీపీకి ఓట్లు వేశారని, ఇప్పుడు జనసేన ఎన్నికల బరిలో నిలుస్తుండడంతో వారంతా జనసేనకే ఓట్లు వేస్తారని అభిప్రాయపడ్డారు. ఫలితంగా టీడీపీకి గత ఎన్నికల్లో వచ్చినన్ని ఓట్లు రావని, ఒకరకంగా ఈ పరిస్థితి తమ పార్టీకి లాభిస్తుందని జగన్ పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసినా…

ఒకవేళ ఎన్నికల నాటికి పరిస్థితులు మారిపోయి.. టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేసినా.. తమ పార్టీకి నష్టమేమీ ఉండదని కూడా వైఎస్ జగన్ భావిస్తోన్నట్లు సమాచారం.

ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వంపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆ విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం వైసీపీకే పడుతుందని కూడా ఆయన చెబుతున్నారట. అంతేకాదు, టీడీపీకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రానంత వ్యతిరేకత ఉందని తన సన్నిహితుల వద్ద జగన్ వ్యాఖ్యానిస్తున్నారట.

రెండిట్లో ఏది జరిగినా గెలుపు మాదే…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనతో కలిసి వస్తారని కూడా వైసీపీ అధినేత జగన్ భావించడం లేదట. ఎందుకంటే అసలు ఆ దిశగా తాము ఎప్పుడూ మాట్లాడింది లేదని జగన్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా, లేదంటే పరిస్థితి మారి జనసేన.. టీడీపీతో కలిసి పోటీ చేసినా తమకు వచ్చే నష్టం లేదని ఆయన భావిస్తున్నారు.

ఒకవేళ జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంత చీలుతుందని, అయినా గతంలో తమ పార్టీకి పడిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకుకు ఇది అదనమే తప్ప మరొకటి కాదని ఆయన భావన.

కలిసి పోటీ చేస్తే ఇంకా మంచిది…

అంతేకాదు.. పవన్ కళ్యాణ్, చంద్రబాబులు కలిసి పోటీ చేస్తే తమ పార్టీకి ఇంకా మంచిదని కూడా జగన్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుపై వ్యతిరేకతతో ప్రజలు జనసేనకు కూడా ఓటేయరని, తమ పార్టీకే పట్టం కడతారని ఆయన భావిస్తున్నారు.

2014లో కలిసి పోటీ చేసి రాష్ట్ర ప్రజలను మోసగించారని, ఇప్పుడు విడిపోయినట్లుగా నటించి మోసం చేస్తున్నారని, ఏదిఏమైనా ప్రజా వ్యతిరేకత కారణంగా ఈసారి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ఖాయమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావిస్తున్నారు.

- Advertisement -