అక్కడా తాగొచ్చు: డ్యాన్స్ బార్లపై ఆంక్షలను సడలించిన సుప్రీం

dance bars
- Advertisement -

 

న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని డ్యాన్స్‌ బార్లపై ఆ రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను సడలిస్తూ సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. డ్యాన్స్‌ బార్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, బార్‌ రూమ్స్‌, డ్యాన్స్‌ ఫ్లోర్లను వేర్వేరు చేయాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం 2016లో ప్రత్యేక నిబంధనలను పొందుపరుస్తూ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

అంతేగాక, డ్యాన్స్‌ చేసే ప్రదేశాల్లో మద్యం సరఫరా నిషేధించడం, రాత్రి 11.30 తర్వాత బార్లను తప్పనిసరిగా మూసివేయాలని లేదంటే వారిపై కఠినమైన చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కాగా, దీన్ని వ్యతిరేకిస్తూ రెస్టారెంట్లు, బార్ల యజమానులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.కె.సిక్రితో కూడిన ధర్మాసనం విచారించింది. డ్యాన్స్‌ బార్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలా చేయడం వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని తెలిపింది. బార్లలో ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసేందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. అలాగే డ్యాన్స్‌ చేసే వారికి టిప్‌ ఇవ్వొచ్చని కానీ వారి మీద నోట్లు, నాణేలు విసరడాన్ని మాత్రం అంగీకరించలేదు.

కీలక సడలింపులు..

కాగా, మత సంబంధ ప్రదేశాలకు, విద్యాసంస్థలకు కిలోమీటరు దూరంలో డ్యాన్స్‌ బార్లు ఉండాలంటూ రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను న్యాయస్థానం తోసిపుచ్చింది. సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు మాత్రమే డ్యాన్స్‌ బార్లు పని చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనను సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమర్థించారు. డ్యాన్స్‌ చేసే ప్రదేశంలో మద్యం సరఫరాకు కోర్టు అంగీకరించింది. డ్యాన్స్‌ ఫ్లోర్లు, బార్‌ రూమ్స్‌ వేర్వేరుగా ఉండాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

 

- Advertisement -