మాస్కో: రష్యా సముద్ర తీరానికి సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు నౌకల్లో మంటలు చెలరేగడంతో 14 మంది చనిపోయారు. ఈ నౌకల్లో భారత్, టర్కీ, లిబియాకు చెందిన సిబ్బంది ఉన్నారు. రష్యా, క్రిమియాకు మధ్యలో ఉన్న కెర్చ్ జలసంధిలో ఈ ప్రమాదం జరిగింది.
ఇవి టాంజానియాకు చెందిన నౌకలుగా గుర్తించారు. ఇందులో ఒకటి ద్రవీకృత సహజవాయువును రవాణా చేసే నౌక కాగా రెండోది ట్యాంకర్. ఇవి పరస్పరం ఇంధనాన్ని బదిలీ చేసుకుంటున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఒక నౌకలో పేలుడు సంభవించి ఉంటుందని, ఆ మంటలు రెండోదానికి వ్యాప్తి చెంది ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. రెండింటిలో కలిపి 32 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 15 మంది భారతీయులు కూడా ఉన్నారు.
ప్రమాదంలో చనిపోయిన 14 మందిలో ఏ దేశాలవారు ఉన్నారన్నదానిపై ఎలాంటి సమాచారం అందలేదు. అయితే, భారతీయుల్లో ఎక్కువమంది సురక్షితంగానే ఉన్నారని తెలిసింది. రెండు నౌకల నుంచి 12 మందిని సహాయ సిబ్బంది రక్షించారు. మరో ఆరుగురి ఆచూకీ దొరకలేదు. వారి కోసం గాలింపు జరుగుతోంది.
భారతీయుల్లో ఎక్కువ మంది క్షేమమే
ఈ రెండు నౌకల్లోని భారత జాతీయుల్లో చాలామంది క్షేమంగానే ఉన్నారని భారత నౌకాయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీఎస్) అధికారులు ముంబైలో తెలిపారు. ఇప్పటికే కొందరు భారత్లోని కుటుంబ సభ్యులతో మాట్లాడి, తమ క్షేమ సమాచారాన్ని తెలియజేశారని వెల్లడించారు.