

చెన్నై: తమిళనాడులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తరగతి గదిలోనే ఓ ఉపాధ్యాయుడిని విద్యార్థులే ఈవ్‌టీజింగ్ చేశారు. అతనిపై చేయి చేసుకున్న ఆ వీడియో వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. దీనిపై విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు నిందితులైన ఆరుగురు ఇంటర్ విద్యార్థులను సస్పెండ్ చేశారు.
వేలూరు జిల్లా తిరుపత్తూరులో రామకృష్ణ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ పాఠశాల్లో 800 మందికి పైగా విద్యార్థులున్నారు. ఇక్కడ ఇంటర్ చదువుతున్న విద్యార్థులు కొద్ది రోజుల కిందట పాఠశాల్లో ఉపాధ్యాయుడు కూర్చునేందుకు వచ్చిన సమయంలో కుర్చీని పక్కకు తోయడం, డ్యాన్సులు చేస్తూ అల్లరి చేయడం వంటివి వీడియో తీసి స్నేహితులకు వాట్సాప్‌లో పంపారు.
ఈ వీడియో పలువురికి చేరడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా చేరింది. ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో తిరుపత్తూరు విద్యాశాఖ అధికారులు పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు. ఆ సమయంలో విద్యార్థులు క్రమశిక్షణ లేకుండా టీచర్‌లను తరచూ వేధిస్తున్నట్లు తెలిసింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులను రప్పించి విద్యార్థుల చేసిన చేష్టల వీడియోను చూపించి విచారణ జరిపారు.
ప్రిన్సిపాల్‌పై కత్తిదాడి: విద్యార్థుల సస్పెన్షన్
అంతేగాక, మరో దారుణ ఘటన కూడా వెలుగుచూసింది. ఈ పాఠశాలలో ప్రిన్సిపాల్‌పై సదరు విద్యార్థులు కత్తితో దాడి చేశారు. దీనిపై విద్యాశాఖ అధికారులు సీరియస్ స్పందించి.. ఆరుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. అయితే వారు పరీక్షలు రాసేందుకు మాత్రం అనుమతిస్తామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృకాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ బాధ్యతను మరవకూడదని సూచించారు.








