
న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో విచారణపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. జయలలిత మరణానంతరం.. ఆమె మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ దానిపై విచారణ జరిపేందుకు తమిళనాడు ప్రభుత్వం ఒక కమిషన్‌ను నియమించిన సంగతి తెలిసిందే.
మాజీ న్యాయమూర్తి ఆర్ముగస్వామి అధ్యక్షతన ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కమిషన్ రంగంలోకి దిగి జయలలిత మృతిపై విచారణ మొదలుపెట్టింది.
అయితే తమ ఆసుపత్రిలో జయలలిత పొందిన చికిత్సకు సంబంధించిన వివరాలపై ఆర్ముగం కమిటీ దర్యాప్తు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ అపోలో ఆస్పత్రి యాజమాన్యం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, న్యాయ స్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.
అపోలో యాజమాన్యానికి ఊరట…
దీంతో అపోలో ఆసుపత్రి యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జయలలిత మరణానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందనీ, అయితే ఆసుపత్రిలో ఉండగా అందించిన చికిత్స సరైనదో కాదో నిర్ధారించే హక్కు ఆర్ముగం కమిషన్‌కు లేదని అపోలో యాజమాన్యం వాదించింది.
కమిటీ నేతృత్వంలో వైద్యులు తమ ఆసుపత్రి రికార్డులు పరిశీలించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఆర్ముగస్వామి కమిషన్ విచారణపై స్టే విధించింది.








