దీక్ష విరమించిన మమతా బెనర్జీ: చంద్రబాబు సంఘీభావం, సీపీపై చర్యలకు కేంద్ర హోం శాఖ లేఖ!

- Advertisement -

mamata

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం సాయంత్రం తన దీక్షను విరమించారు. ఆమె గత రెండ్రోజులుగా సేవ్ ఇండియా పేరుతో కేంద్రంపై నిరసనగా సత్యాగ్రహ దీక్ష చేసిన విషయం తెలిసిందే. శారదా చిట్ ఫండ్ స్కాం కేసులో కలకత్తా సీపీ రాజీవ్ కుమార్‌ను సీబీఐ అరెస్ట్ చేసేందుకు రావటంతో మమత తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

అంతేకాదు, సీబీఐ అధికారులను ఆమె అరెస్ట్ చేయించారు. ఆ తర్వాత విడుదల చేశారు.  ఈ క్రమంలో సీబీఐని అడ్డుపెట్టుకుని కేంద్రం వేధింపులకు గురిచేస్తోందని మమత ఆరోపించారు. మరోవైపు ఈ విషయంలో రాష్ట్ర పోలీసు అధికారులను అరెస్ట్ చేయకుండా విచారించాలని సీబీఐకి మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

చదవండి: మమతకి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు! కొనసాగుతున్న ధర్నా…

అలాగే సీబీఐ విచారణకు రాష్ట్ర అధికారులు కూడా సహకరించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. చివరికి ప్రజాస్వామ్యం విజయం సాధించిందంటూ వ్యాఖ్యానించిన మమతా బెనర్జీ తన దీక్షను విరమించారు. కాగా, సీబీఐ అంశంపై ఫిబ్రవరి 3 నుంచి మమత ధర్నా సాగిస్తున్న విషయం తెలిసిందే.

మమతకు చంద్రబాబు సంఘీభావం…

కేంద్ర ప్రభుత్వ తీరుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్టీ చేపట్టిన సత్యాగ్రహం దీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కలకత్తాకు వెళ్లి మమతను పరామర్శించారు. మధ్యాహ్నం అమరావతి నుంచి నేరుగా కలకత్తాకు చేరుకుని ఆమెకు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. విపక్షాలకు మమతా బెనర్జీ మూల స్తంభమని, టీఎంసీ పార్టీ పశ్చిమబెంగాల్ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 42 స్థానాలనూ గెలుచుకుంటుందని అన్నారు. కాగా, మమత దీక్షకు దాదాపు అన్ని విపక్ష పార్టీల నుంచి మద్దతు వ్యక్తమవుతోంది.

దీక్షలో పాల్గొన్న సీపీపై చర్యలు…

ఇదిలా ఉండగా.. కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్‌ రాజీవ్ కుమార్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో రాజీవ్ కుమార్ కొందరు పోలీసు అధికారులతోపాటు సీఎం మమతా బెనర్జీతో కలిసి ధర్నాలో పాల్గొన్నట్లు సమాచారం అందిందని పేర్కొంది. ఇది ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకమని స్పష్టం చేసింది.

సీపీ రాజీవ్ కుమార్.. సీఎం మమతా బెనర్జీ దీక్షలో పాల్గొనడం అఖిల భారత సర్వీసుల ప్రవర్తనా నియమాలు, 1968, అఖిల భారత సర్వీసులు క్రమశిక్షణ, అపీలు రూల్స్, 1969లకు విరుద్ధమని కేంద్ర హోం శాఖ రాష్ట్ర సీఎస్‌కు రాసిన లేఖలో పేర్కొంది.

 

- Advertisement -