సుప్రీం సంచలనం: నిందితులకు ఉరిశిక్ష నుంచి విముక్తి, పరిహారం.. మహారాష్ట్ర సర్కారుకు అక్షింతలు!

Supreme Sensational Judgement, Newsxpressonline
- Advertisement -

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒక హత్య కేసులో 16 ఏళ్లపాటు జైలుశిక్ష అనుభవిస్తూ.. ఉరిశిక్ష కూడా పడిన ఆరుగురు ముద్దాయిలను సుప్రీంకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అంతేకాదు, వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మహారాష్ట్ర సర్కారు పరిహారం కూడా ఇవ్వాలంటూ ప్రకటించింది. జస్టిస్ ఏకే సిక్రి సారథ్యంలోని బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ సందర్భంగా మహారాష్ట్ర సర్కారు తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. సదరు హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు సందర్భంగా ఏమాత్రం ప్రమాణాలు, సరైన ప్రాసిక్యూషన్ విధానాలు పాటించలేదంటూ ప్రభుత్వాన్ని మందలించింది. అంతేకాదు, ఈ కేసులో తప్పు చేసిన పోలీసులపై తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా దర్యాప్తు జరిపించాలంటూ మహారాష్ట్ర చీఫ్ సెక్రెటరీని జస్టిస్ ఏకే సిక్రీ ఆదేశించారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే… 2003 జూన్ నెలలో ఓ దొంగతనం సందర్భంగా సామూహిక అత్యాచారం, ఐదుగురు కుటుంబ సభ్యుల హత్య జరిగాయి. ఈ కేసులో అంకుష్ మారుతి షిండే, రాజయప్ప షిండే, రాజు మహసు షిండే, మరో ముగ్గురిని పోలీసులు నేరస్థులుగా నిర్ధారించి కింది కోర్టులో హాజరుపరిచారు.

మొదట ముగ్గురికి, ఆ తరువాత ఆరుగురికీ ఉరిశిక్ష…

వీరిలో అంకుష్, రాజయప్ప, రాజులకు ఉరిశిక్ష విధించారు. ఈ శిక్షపై వీరు పైకోర్టుకు అప్పీలు చేసుకోగా 2007లో ముంబై హైకోర్టు కూడా వీరికి విధించిన శిక్షను సమర్థించింది.  ఆ తరువాత 2009లో సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోగా, చేసింది తీవ్ర నేరం అయినందున, మొత్తం ఆరుగురూ ఉరిశిక్షకు అర్హులేనని సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది.

అయితే ఆ తరువాత జరిగిన దర్యాప్తులో నేరం జరిగిన సమయంలో అంకుష్ మారుతి షిండే వయసు 18 ఏళ్ల కంటే తక్కువేనని తేలడంతో అతడ్ని జువనైల్ జస్టిస్ కోర్టుకు పంపారు. మిగిలిన ఐదుగురు దోషులు కూడా తమకు విధించిన ఉరిశిక్షపై మళ్లీ ఒకసారి పరిశీలించాలని కోర్టును ఆశ్రయించారు.

దీనిపై సోమవారం సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ విచారణ జరిపింది. అనంతరం జస్టిస్ ఎంఆర్ షా తీర్పును చదువుతూ.. నిందితులపై ఉన్న ఆరోపణల నుంచి వారికి విముక్తి కలిగిస్తున్నామని, చేయని నేరానికి 16 ఏళ్లపాటు వారంతా జైలులోనే మగ్గిపోయారని.. కాబట్టి వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

అంతేకాకుండా, తప్పుడు కేసులు బనాయించి వారి దుస్థితికి కారణమైన ఈ మొత్తం వ్యవహారంపై ప్రత్యేక విచారణ జరిపించి, తమకు నివేదిక అందించాలంటూ ఆ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీని ఆదేశించారు.

 

 

- Advertisement -