

న్యూఢిల్లీ: కేరళలోని పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో పెట్టింది. కాగా, అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తన వైఖరి మార్చుకుంది. ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తామని రివ్యూ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానానికి తెలిపింది.
మహిళల శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ బోర్డు, నాయర్ సర్వీస్ సొసైటీ సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిలో కొన్ని రివ్యూ పిటిషన్లు కూడా ఉన్నాయి. వీటిపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
మహిళల ప్రవేశంపై వైఖరి మార్చుకున్న ట్రావెన్‌కోర్ టెంపుల్ బోర్డ్
ట్రావెన్ కోర్ బోర్డు తరపున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది వాదనలు వినిపిస్తూ.. ‘మాతాచారాలు అందరికీ సమానంగా ఉంటాయని 25(1) చెబుతోంది. జీవ సంబంధిత లక్షణాల కారణంగా మహిళలపై వివక్ష చూపించడం సరికాదు. శబరిమల అంశంలో న్యాయస్థానం తీర్పును అంగీకరిస్తున్నాం’ అని కోర్టుకు తెలిపారు. అయితే, రుతుక్రమ వయసు మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించమని ట్రావెన్ కోర్ బోర్డు గతంలో పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ వాదనతో తన వైఖరి మార్చుకున్నట్లు తెలుస్తోంది.
అంతకుముందు నాయర్ సర్వీస్ సొసైటీ, కేరళ ప్రభుత్వం కూడా తమ వాదనలను వినిపించింది. శబరిమల తీర్పును పున:సమీక్ష చేపట్టాల్సిన అవసరం లేదని, దీనిపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేయాలని కేరళ ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ లో పెడుతున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.
కాగా, గత సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు 10-50ఏళ్ల మహిళలు కూడా శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చునని తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్త ఆందోళనలు చెలరేగాయి. కేరళలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తీర్పుపై రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి.








