

కలియుగ దైవం శ్రీనివాసుడి సాక్షిగా ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక‌్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. రేణిగుంట సమీపంలో బుధవారం యోగానంద ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ‘సమర శంఖారావం’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే మీరందరూ సవ్యసాచులై పని చేయాలని వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఏపీలో ఎన్నికలు వస్తున్నాయంటే పోలీసులతో గూండాగిరి చేయిస్తారని, వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆ పార్టీ అధినేత జగన్ ఆరోపించారు. తిరుపతిలో నిర్వహిస్తున్న ‘సమర శంఖారావం’లో ఆయన మాట్లాడుతూ, ఎల్లో మీడియా గురించి చెప్పనక్కర్లేదని, ఎల్లో మీడియా సాయంతో దొంగ సర్వేలు వేయిస్తారని, 59 లక్షల దొంగ ఓట్లను నమోదు చేయించారని ఆరోపించారు. వచ్చే ఎన్నికలు న్యాయానికి, అన్యాయానికి, ఆప్యాయతకు డబ్బుకు మధ్య జరిగేవిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన విరుచుకుపడ్డారు. రైతులకు ఆర్థిక సాయమంటూ డ్రామాలాడుతున్నారని, వారి జీవితాలతో ఆటలాడుతున్నారని విమర్శించారు.
ఇకపోతే నవరత్నాలలో భాగమైన అవ్వ , తాతల పింఛన్ ని మూడువేలకి పెంచుతూ సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు.








