30 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం మనీలాండరింగ్ కేసు: ఈడీ ముందు హాజరైన రాబర్ట్ వాద్రా, వెంట వచ్చిన ప్రియాంక…

మనీలాండరింగ్ కేసు: ఈడీ ముందు హాజరైన రాబర్ట్ వాద్రా, వెంట వచ్చిన ప్రియాంక…

robert vadra
- Advertisement -

vadra

న్యూఢిల్లీ: హవాలా డబ్బు ద్వారా విదేశాల్లో ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ అల్లుడు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారించింది. జామ్‌నగర్ హౌస్‌లో ఉన్న ఆ సంస్థ కార్యాలయానికి ఆయన తన న్యాయవాదులతోపాటు సాయంత్రం 3.47గంటలకు హాజరయ్యారు.

ఎస్పీజీ భద్రత మధ్య తెల్లని టొయోటా ల్యాండ్ క్రూయిజర్ కారులో వాద్రాకు తోడుగా ప్రియాంక కూడా ఈడీ కార్యాలయం వరకు రావడం విశేషం. వాద్రాను అక్కడ దింపిన వెంటనే ప్రియాంక తిరిగి వెళ్లిపోయారు. ఆ సమయంలో అక్కడ ఇదే కేసులో గతంలో విచారణను ఎదుర్కొన్న ఢిల్లీ కాంగ్రెస్ నాయకుడు జగదీశ్ శర్మ ఉన్నారు. కాగా, వాద్రాను ఈ కేసులో కావాలనే ఇరికించే ప్రయత్నం జరుగుతోందని శర్మ ఆరోపించారు.

కాగా, ఈడీ ముందు హాజరు కావడం వాద్రాకు ఇదే తొలిసారి. తల్లి చికిత్స నిమిత్తం లండన్ వెళ్లిన ఆయన అక్కడ నుంచే ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ సమర్పించారు. ఫిబ్రవరి 16 వరకు బెయిల్ మంజూరు చేస్తూ దర్యాప్తునకు సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. బుధవారం ఉదయమే లండన్ నుంచి వచ్చిన ఆయన మధ్యాహ్నం ఈడీ కార్యాలయానికి వెళ్లారు.

రాబర్ట్ వాద్రాను ఈడీ దాదాపు ఐదున్నర గంటలపాటు విచారించింది. దాదాపు 40 ప్రశ్నలు వేసి లిఖిత పూర్వకంగా సమాధానం రాబట్టింది. తనకు లండన్‌లో ఎలాంటి ఇల్లులేదని వాద్రా చెప్పినట్లు తెలిసింది. సంజయ్ భండారీ కూడా ఎవరో తెలియదని అన్నట్లు సమాచారం. తన సంస్థలో పనిచేస్తున్నందున మనోజ్ అరోరా తెలుసని చెప్పారు.

వాద్రా నా భర్త, అండగా ఉంటా: ప్రియాంక

ఈడీ కార్యాలయం నుంచి నేరుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చిన ప్రియాంక గాంధీ.. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వాద్రాను ఈడీ కార్యాలయం వద్ద దింపడం ద్వారా ఏ రాజకీయ సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని మీడియా ప్రశ్నించగా.. ‘ఆయన నా భర్త. ఆయన నా కుటుంబం. కుటుంబానికి అండగా ఉంటా. ఈ దర్యాప్తు ఎందుకు జరుగుతుందో అందరికీ తెలిసిందే’ అని ప్రియాంక అన్నారు.

వాద్రా కేసు విషయానికొస్తే..

రాబర్ట్ వాద్రాకు లండన్‌లో అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఈడీ ఆరోపించింది. ఇందులో భాగంగానే గత డిసెంబరులో వాద్రాకు సంబంధం ఉన్న స్కైలెట్ హాస్పిటాలిటీ సంస్థ మనోజ్ ఆరోరాను విచారించింది.

మరో కేసులో ఆదాయపు పన్ను విభాగం మనోజ్ అక్రమ నగదు చలామణికి పాల్పడినట్లు గుర్తించిందని తెలిపింది. పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీకి చెందిన కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు ఇది వెలుగులోకి వచ్చిందని పేర్కొంది.

భండారి 2010లో లండన్‌లోని 12, బ్రైన్‌స్టన్ స్క్వేర్‌లో 1.9 మిలియన్ పౌండ్లు(రూ.17.62కోట్లు)తో భవనం కొనుగోలు చేశారని, దానికి 65,900 పౌండ్లు(రూ.61లక్షలు)తో అదనపు సౌకర్యాలు కల్పించారని తెలిపింది. అయితే, భండారీ, మనోజ్‌లు బినామీలని, అసలు యజమాని రాబర్ట్ వాద్రాయేనని ఆరోపించింది.

మనోజ్ పేరున ఒక్కొక్కటి దాదాపు రూ.37కోట్లు విలువ చేసే రెండు ఇళ్లు, నాలుగు ఫ్లాట్లు ఉన్నట్లు సమాచారం అందిందని తెలిపింది. మరోవైపు మనోజ్‌కు కూడా ఫిబ్రవరి 12 వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు.

పెట్రోలియం, రక్షణ ఒప్పందాల్లో వాద్రాకు ముడుపులు

వాద్రా ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఆయనపై బీజేపీ నేత సంబిత్ పాత్ర పలు ఆరోపణలు చేశారు. యూపీఏ అధికారంలో ఉన్న కాలంలో పెట్రోలియం, రక్షణకు సంబంధించిన ఒప్పందాల్లో వాద్రాకు ముడుపులు అందాయని ఆయన చెప్పారు. బీజేపీ ‘2008–09 కాలంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు అందిన ముడుపులతో వాద్రా లండన్‌లో 8 నుంచి 9 స్థిరాస్తులు కొన్నారు’ అని పేర్కొన్నారు.

‘రోడ్ల వెంట తిరిగే వ్యక్తి కోటీశ్వరుడు అవ్వడానికి సూత్రం ఏంటి? కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన లక్ష్యం అవినీతికి పాల్పడటమే. ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న కుటుంబంలో ప్రతి ఒక్కరూ బెయిల్‌పై బయటే ఉన్నారని అందరికీ తెలుసు. అవినీతి ముఠాకు, పారదర్శక మోడీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరాటమే 2019 లోక్‌సభ ఎన్నికలు’ అని సంబిత్ పాత్ర అన్నారు.

- Advertisement -