
న్యూఢిల్లీ: టెలికం రంగంలో అడుగుపెట్టి మార్కెట్‌ను షేక్ చేసిన రిలయన్స్ జియో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖ టెలికం కంపెనీలను షేక్ చేసిన జియో.. ఈసారి బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో సంచలనాలకు సిద్ధమైంది.
గిగాఫైబర్ పేరుతో ఒకేసారి ఒకే కనెక్షన్‌పై మూడు సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 12న ఈ సేవలను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
జియో గిగాఫైబర్ సేవలను దేశవ్యాప్తంగా 1100 నగరాల్లో పరీక్షిస్తున్నారు. ఈ పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 12న జరగనున్న జియో వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో గిగాఫైబర్‌ను అధినేత ముకేశ్ అంబానీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
అయితే, గిగాఫైబర్ ప్లాన్లు, ధరల వివరాలు అధికారికంగా వెల్లడి కానప్పటికీ జాతీయ మీడియాలో కొన్ని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వాటి ప్రకారం..
జియో గిగాఫైబర్‌లో ఖాతాదారులకు 28 రోజుల కాలపరిమితితో మూడు సేవలు లభించనున్నాయి. అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్, జియో హోం టీవీ సర్వీసులు, కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ కింద జియో యాప్స్‌కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.
అలాగే, కాంబోప్లాన్‌లో బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, టీవీ సేవలను ఒకే ఒక్క కనెక్షన్‌తో పొందవచ్చు. ఈ ప్లాన్ ధర నెలకు రూ.600గా ఉండే అవకాశం ఉంది. వెయ్యి రూపాయల ప్లాన్‌లో ఇంట్లోని 40 డివైజ్‌లకు ఈ సేవలను ఉపయోగించుకునేలా మరో ప్లాన్ కూడా ఉన్నట్టు సమాచారం. రూ.600 నుంచి వెయ్యి రూపాయల మధ్య మొత్తంగా మూడు వేర్వేరు ప్లాన్లను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
దీంతోపాటు మూడు సేవల్లో ఏదో ఒకదానిని కూడా ఎంచుకునే వెసులుబాటు ఉన్నట్టు సమాచారం. అయితే, కనెక్షన్ తీసుకునే సమయంలో సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.2500 కానీ, రూ.4500 కానీ వసూలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సేవలు వద్దనుకున్నప్పుడు ఈ మొత్తాన్ని తిరిగి ఖాతాదారులకు వెనక్కి ఇచ్చేస్తారని జియో వర్గాలు పేర్కొన్నాయి.








