లోక్‌సభ ఎన్నికల్లో ఎంతమంది మహిళా అభ్యర్ధులు గెలిచారంటే?

10:12 am, Sat, 25 May 19

ఢిల్లీ: తాజాగా వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మెజారిటీ స్థానాలని గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటుకి సిద్ధమైన విషయం తెలిసిందే. మొత్తం 542 స్థానాల్లో ఎన్డీయే 353 స్థానాలని గెల్చుకుని సత్తా చాటింది.

ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 92 స్థానాలకి పరిమితం కాగా, ఇతరులు 97 స్థానాల్లో గెలుపొందారు. ఈ క్రమంలోనే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 78 మంది మహిళలు విజయం సాధించి సత్తా చాటారు.

మొత్తం 542 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 724 మంది మహిళలు పోటీ చేశారు. స్వతంత్ర భారతదేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి 78 మంది ఎన్నికై రికార్డులకెక్కారు.

ఈ ఎన్నికల్లో 41 మంది సిట్టింగ్ ఎంపీలు మళ్లీ బరిలో నిలవగా వారిలో 27 మంది విజయం సాధించారు. వీరిలో చాలామంది మహిళలు హేమాహేమీలను మట్టికరిపించడం మరో విశేషం. భోపాల్‌లో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌ను బీజేపీ నేత సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ ఓడించగా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఓడించారు. 16వ లోక్‌సభలో 64 మంది మహిళల ప్రాతినిధ్యం ఉండగా, ఈసారి అది 78కి చేరుకుంది.

చదవండి: రాజకీయ అరంగ్రేటంలోనూ అదరగొట్టిన గంభీర్…