33.4 C
Hyderabad
Saturday, October 17, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం రైల్వేలో 2.30లక్షల ఉద్యోగాల భర్తీ: 10శాతం EWS కోటాతో అమలు

రైల్వేలో 2.30లక్షల ఉద్యోగాల భర్తీ: 10శాతం EWS కోటాతో అమలు

piyush goyal
- Advertisement -

piyush goyal

న్యూఢిల్లీ: భారత రైల్వే శాఖ భారీ ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. వచ్చే రెండేళ్లలో రైల్వేలో 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ బుధవారం వెల్లడించారు. తొలిదశలో 1.31 లక్షల పోస్టులను, రెండో దశలో 99 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.

14 నెలల క్రితం 1,51,548 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించామనీ, ఇప్పుడు దానికి అదనంగా 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని తెలిపారు. ఇందులో 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం పేదలకు 10% కోటా కల్పిస్తామనీ, తద్వారా 23 వేల మంది పేదలు లబ్ధి పొందుతారని వివరించారు. ఈ పోస్టులకు స్థాయిని బట్టి ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్‌ విద్యార్హతలు ఉన్నవారు అర్హులని మంత్రి ప్రకటించారు.

పలు రైళ్ల పొడగింపు, స్టాప్‌ల పెంపు

కాగా, దేశ వ్యాప్తంగా 22 రైళ్ల సేవలను పొడిగిస్తున్నట్లు పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. హావ్‌డా-విజయవాడ హమ్‌ సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ (20889/20890)ను తిరుపతి వరకు నడుస్తుంది. ఇది ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. కటక్‌-బ్రహ్మపుర (68433/68434 మెమూ)ను ఇచ్చాపురం వరకు పొడిగించారు. ఈ మార్గంలోని అన్ని స్టేషన్లలో ఇకపై ఈ రైలు ఆగుతుందని కేంద్రమంత్రి వెల్లడించారు.

మిర్యాలగూడ-కాచిగూడ (77673/77674 డెమూ) రైలును నడికుడి వరకు నడుస్తుంది. ఇక నుంచి ఇది కొండ్రాపోలె హాల్ట్‌, విష్ణుపురం, పొందుగుల స్టేషన్లలో ఆగుతుంది. విశాఖపట్నం-పలాస (58526/58525) ప్యాసింజర్‌ బ్రహ్మపుర వరకు వెళ్తుంది. ఆ మార్గంలోని అన్ని స్టేషన్లలోనూ ఈ రైలు ఆగుతుంది. సికింద్రాబాద్‌-తాండూరు (67249/67250 మెమూ) రైలును చిత్తాపుర్‌ వరకు పొడిగించారు. ఇది మన్‌తట్టి, నవంద్గి, కురుగుంట, సెరం, మల్‌ఖయిడ్‌రోడ్డు స్టేషన్లలో ఆగుతుంది.

- Advertisement -