పీఠాధిపతిగా వెళ్లాల్సిన పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు!

- Advertisement -

న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గురించి ఎవరికీ తెలియని విషయం ఇది. ఆధ్యాత్మక చింతన కలిగిన పీవీ ఒకానొక దశలో పీఠాధిపతి అవాల్సింది.

ఇందుకు సంబంధించి వచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించకుండా, తిరస్కరించకుండా మధ్యస్థంగా ఉండిపోయిన ఆయన ఆ తర్వాత ప్రధానై దేశ కీర్తిని నలు దిశలా చాటారు. అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు.

ఆదిశంకరాచార్య సంప్రదాయాన్ని కొనసాగించేందుకు తమిళనాడు, కుర్తాళంలోని సిద్ధేశ్వర పీఠాన్ని స్థాపించారు. పీవీ తరచూ ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తూ ఉండేవారు.

ఆ పీఠాధిపతి మౌనస్వామి శివసాయుజ్యం పొందిన తర్వాత వారసుడి కోసం అన్వేషించిన ఆశ్రమం.. పీవీ అందుకు యోగ్యుడని భావించి సందేశం పంపింది. అయితే, ఈ ఆహ్వానాన్ని పీవీ తిరస్కరించనూ లేదు, అలాగని అంగీకరించనూ లేదు.

అదే సమయంలో అంటే 1991లో పీవీకి టికెట్ ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. దీంతో తన రాజకీయ జీవితం ముగిసిపోయిందని భావించిన పీవీ.. కుర్తాళం పీఠం బాధ్యతలు స్వీకరించేందుకు దాదాపు సిద్ధమయ్యారు.

అయితే, అదే ఏడాది మే 21న రాజీవ్‌గాంధీ హత్యకు గురయ్యారు. దీంతో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు నిరాకరించిన సోనియా గాంధీ.. పీవీకి పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ మెజారిటీకి దూరంగా నిలిచినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని పదవికి ఎందరో పోటీ పడినా చివరికి పీవీకి దక్కింది. అలా.. పీఠాధిపతి కావాల్సిన పీవీ ప్రధాని అయ్యారు.

- Advertisement -