23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం క్రియాశీల రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ: యూపీ కాంగ్రెస్‌లో కీలక పదవి, యోగికి ప్రత్యర్థిగా..

క్రియాశీల రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ: యూపీ కాంగ్రెస్‌లో కీలక పదవి, యోగికి ప్రత్యర్థిగా..

priyanka
- Advertisement -

లక్నో: యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ కుమార్తె, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకగాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయమైంది. గతంలో పలుమార్లు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నప్పటికీ ఆమె ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించలేదు. కానీ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిని చేపడుతున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ తూర్పు ప్రాంతంలోని కాంగ్రెస్‌ విభాగం జనరల్‌ సెక్రటరీగా ఆమె నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఓ ప్రకటనను విడుదల చేసింది. కాగా, యూపీ పశ్చిమ‌ భాగంలోని కాంగ్రెస్‌ విభాగం జనరల్‌ సెక్రటరీగా జ్యోతిరాధిత్య సింథియాను నియమించారు. కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ(ఆర్గనైజేషన్‌)గా కేసీ వేణుగోపాల్‌ నియమిస్తున్నట్లు అధిష్ఠానం నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రియాంక గాంధీ తన బాధ్యతలను స్వీకరించనున్నారు.

యోగి ఆదిత్యనాథ్‌కు పోటీగానే..

ఇది ఇలావుంటే, యూపీ తూర్పు ప్రాంతానికి బీజేపీ తరఫు నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రియాంక వాద్రాను ఇప్పుడు ఆయనకు ప్రత్యర్థిగా రంగంలోకి దించారు. సార్వత్రిక ఎన్నికల కొద్ది నెలల ముందే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ రావడంపై పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు స్వాగతిస్తున్నారు.

ఇప్పటి వరకు ప్రియాంక తన తల్లి, సోదరుడి సొంత నియోజకవర్గాలైన రాయ్‌బరేలి, అమేథి ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారాల్లో ఆమె పాల్గొన్నారు. అఖిలేశ్‌- మాయావతి పొత్తు నేపథ్యంలో యూపీలో ఎలాగైనా అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని ఉద్దేశంతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మోతిలాల్‌ వోహ్రా మాట్లాడుతూ.. చాలా కీలక బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించారని అన్నారు. యూపీ తూర్పు ప్రాంతాన్నే కాకుండా ఇతర ప్రాంతాల్లోను ఆమె
ప్రభావం ఉంటుందని చెప్పారు.

- Advertisement -