
న్యూఢిల్లీ: గత 4 నెలలుగా ప్రపంచం కరోనా వైరస్‌తో పోరాడుతోందని, ఈ పోరాటంలో ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 42 లక్షల మంది బాధితులుగా మారగా, 2.75 లక్షల మంది మృత్యువాత పడ్డారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
మంగళవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. మన దేశంలో కూడా ఎంతో మంది అయిన వారిని పోగొట్టుకున్నారని, వారికి తాను తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.
అయితే ఈ పెను విపత్తు భారత్‌కు ఒక సందేశాన్ని, అవకాశాన్ని తీసుకొచ్చిందన్నారు. ఇప్పుడు దేశంలోని ప్రతి ఒక్కరూ ‘ఆత్మ నిబ్బర భారత్’ అనే సంకల్పాన్ని తీసుకోవాలని ప్రధాని కోరారు.
ఒక దేశంగా ఇప్పుడు మనం కీలక మలుపులో ఉన్నామని, భారత్ కోణంలో చూస్తే 21వ శతాబ్ధం భారత్‌దే కాబోతోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఒకప్పుడు దేశంలో ఎన్-95 మాస్కుల ఉత్పత్తి మన దేశంలో నామమాత్రంగా ఉండేదని, అయితే ఇప్పుడు భారత్‌లోనే రోజుకు 2 లక్షల ఎన్-95 మాస్కులు, 2 లక్షల పీపీఈ కిట్‌లు తయారవుతున్నాయని తెలిపారు.
ఇప్పుడు ప్రపంచానికి కావాల్సిన మందులు, మాస్కులను తయారు చేసి సరఫరా చేయగల స్థితికి మన దేశం చేరుకుని ప్రపంచాన్నే విస్తుపోయేలా చేసిందన్నారు. దీంతో ప్రపంచ దేశాలకు భారత్ ఒక ఆశాకిరణంగా కనిపిస్తోందని అభివర్ణించారు.
భారత్ ఎల్లప్పుడూ ప్రపంచ అభివృద్ధితోనే కలిసి ఉంటుంది. టీబీ, పోలియో, పౌష్టికాహార లోపంపై భారత్ చేసిన పోరాటం ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా మారింది.
స్వయం సమృద్ధ భారత్ కోసం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజిని ప్రకటించినట్లు మోడీ తెలిపారు. భారత్ జీడీపీలో ఇది 10 శాతం అన్నారు. ఈ ప్యాకేజీతో భారత్ తప్పక స్వయం సమృద్ధి సాధిస్తుందన్నారు.








