26.1 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ మానవతా దృక్పథంతో ఆలోచించాలి.. కృష్ణా జలాల అంశంపై స్పందించిన జగన్

మానవతా దృక్పథంతో ఆలోచించాలి.. కృష్ణా జలాల అంశంపై స్పందించిన జగన్

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదానికి కారణమైన కృష్ణా జలాల అంశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. 

ఈ విషయంలో మానవతా దృక్పథంతో ఆలోచించాలని అన్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగడానికి నీళ్లులేని పరిస్థితి ఉందన్నారు.

రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామని,. కృష్ణా బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి నీటి కేటాయింపులు చేస్తోందని అన్నారు.

ఆ పరిధి దాటి నీటిని తీసుకెళ్లడానికి బోర్డు కూడా అంగీకరించదన్నారు. ఏ రాష్ట్రం కూడా అదనంగా నీటిని వాడుకునే అవకాశం ఉండదని జగన్ పేర్కొన్నారు.

ఏపీకి కేటాయించిన నీటిని తీసుకోవడానికి పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకుంటున్నామని వివరించారు. శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల తీసుకునే అవకాశం ఉందని సీఎం వివరించారు.

ఆ స్థాయిలో నీటిమట్టం సంవత్సరంలో సగటున 10 రోజులకు మించి ఉండదని అన్నారు. ఆ పదిరోజుల్లోనే పోతిరెడ్డిపాడు ద్వారా కరువు పీడిత రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.

శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు ద్వారా 7వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లడం కష్టమన్నారు. 841 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు నుంచి వెళ్లే నీళ్లు  1000 క్యూసెక్కుల మాత్రమేనని జగన్ పేర్కొన్నారు.

చదవండి: ఏపీ-టీఎస్ మధ్య ముదురుతున్న జల జగడం.. కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు
- Advertisement -