
న్యూఢిల్లీ: దేశంలో హాట్‌స్పాట్స్ మినహా లాక్‌డౌన్ ఎత్తివేతకే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే రెడ్‌జోన్లలో లాక్‌డౌన్ నిబంధనల అమలును మరింత కఠినం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
సోమవారం ఉదయం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానంగా ఈ విషయంపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
కరోనా వైరస్ కాటు నుంచి తప్పించుకునేందుకు లాక్‌డౌన్ మినహా మరో మార్గం లేదనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలూ ఈ పద్ధతిని పాటిస్తున్నాయి. మన దేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ తొలుత ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ విధించారు.
వైరస్ ప్రభావం తగ్గకపోవడంతో రెండో విడతగా మళ్లీ లాక్‌డౌన్‌ను మరో 19 రోజులపాటు పొడిగించారు. ఈ రెండో విడత లాక్‌డౌన్ కూడా మే 3వ తేదీన ముగుస్తుంది.
ఈ నేపథ్యంలో మళ్లీ ఒకసారి ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్‌డౌన్ ఎత్తివేత మంచిదా? లేక లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ మరిన్ని సడలింపులు ఇవ్వాలా? అనే విషయాలపై చర్చించారు.
చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని ప్రధాని మోడీని కోరారు. అయితే హాట్‌స్పాట్స్‌లో మాత్రం లాక్‌డౌన్ కొనసాగుతుందని ఆయన వారితో చెప్పినట్లు తెలుస్తోంది.
అలాగే ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి కూడా సంతృప్తికరంగానే ఉందని, బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారు తప్పని సరిగా ఫేస్ మాస్కు ధరించాలని పేర్కొన్న ప్రధాని.. రెండు గజాల దూరం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించినట్లు సమాచారం.
పినరయి డుమ్మా, మమతా హాజరు…
ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హాజరుకాలేదు. ఆయనకు బదులుగా ఆ రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి హాజరయ్యారు.
ఇక కోల్‌కతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకారనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. సోమవారం నాటి కాన్ఫరెన్స్‌కు ఆమె హాజరై అందరి అంచనాలను తలకిందులు చేశారు.
అయితే ఆమెకు సమావేశంలో మాట్లాడే అవకాశం కలగలేదు. దీంతో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దేశంలోని పెద్ద రాష్ట్రాలను సంప్రదించే తీసుకోవాలంటూ ఆమె వీడియో కాన్ఫరెన్స్ ముగిశాక డిమాండ్ చేశారు.
‘‘లాక్‌డౌన్ మరో నెల రోజులు పొడిగించండి..’’
ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ.. వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి రానందున లాక్‌డౌన్‌ను మరో నెల రోజులపాటు పొడిగిస్తేనే మంచిదని సూచించినట్లు తెలుస్తోంది.
అయితే ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూనే ‘గ్రీన్ జోన్స్’లో నిబంధనలను మరింత సరళీకరించాలని ప్రధానిని కోరినట్లు సమాచారం.
అమలులోకి ‘రెడ్, ఆరెంజ్, గ్రీన్’ జోన్స్ విధానం…?
ఇక కేంద్రం ఎప్పట్నించో చెబుతోన్న ‘రెడ్-ఆరెంజ్-గ్రీన్’ జోన్ల విధానం ఈసారి అమలులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైరస్ వ్యాప్తి ఆదారంగా ప్రతి రాష్ట్రాన్ని రెడ్-ఆరెంజ్-గ్రీన్ జోన్ల కింద విభజించాలని కేంద్రం గతంలోనే అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
రెడ్ జోన్లను పూర్తిగా ఐసోలేట్ చేసి.. ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని, ప్రభుత్వ రవాణాను అనుమతించకపోయినా.. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ప్రైవేటు వాహనాలను అనుమతించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు విమాన, రైలు ప్రయాణాలు ఇప్పట్లో మొదలయ్యేలా లేవు. అలాగే పాఠశాలలు, కళాశాలలు కూడా ఇప్పుడప్పుడే తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు.








