లోక్‌సభ ఎన్నికల్లో గెలుపెవరిది? ప్రియాంక ప్రభావం ఎంత?: ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర విశ్లేషణ

modi-prashant
- Advertisement -

prashant kishor

న్యూఢిల్లీ: రాజకీయ వ్యూహాకర్త, జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి వస్తారని ఆయన జోస్యం చెప్పారు. అయితే, సీట్లు ఎన్ని వస్తాయనే విషయంపై తాను ఖఛ్చితంగా చెప్పలేనని తెలిపారు.

‘ఇప్పటివరకు ఉన్న పరిస్థితుల ప్రకారం కేంద్రంలో ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎన్ని సీట్లు గెలుచుకుంటుందన్న విషయాన్ని మాత్రం నేను అంచనా వేయలేను. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటి ప్రభావాలు లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏపై అంతగా ప్రభావం చూపవని భావిస్తున్నాను’ అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

ఎన్డీయేలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ పెద్ద నాయకుడే అయినా.. బీజేపీకి పూర్తి మెజార్టీ రానిపక్షంలో నితీశ్ కుమార్ ప్రధాని పదవి రేసులో నిలుస్తారా? అన్న ప్రశ్నను లేవనెత్తడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్డీయేలో బీజేపీ, శివసేన తర్వాత మూడో అతిపెద్ద పార్టీ జేడీయూనేనని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

శివసేన-బీజేపీ మధ్య సయోధ్య కుదిర్చేందుకే శివసేన అధినేత ఉద్దవ్ థాకరేతో గత వారం తాను భేటీ అయ్యానని జరుగుతున్న ప్రచారాన్ని ప్రశాంత్ కిషోర్ తోసిపుచ్చారు. ఉద్దవ్ థాకరే ఆహ్వానం మేరకే తాను ఆయన్ను కలిసినట్లు చెప్పారు. ఎన్నికల వ్యూహాల విషయంలో శివసేనకు తాను సహకరిస్తున్నట్లు మీడియాలో వెలువడిన కథనాలను కూడా ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతం తాను జేడీయు నేతగా ఉన్నానని.. అందుకే మరో పార్టీకి రాజకీయ వ్యూహాలకు సంబంధించిన సలహాలు ఇవ్వలేనని స్పష్టం చేశారు.

ఎన్నికల్లో ప్రియాంక ప్రభావంపై ప్రశాంత్ కిషోర్

యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ వాద్రా క్రియాశీల రాజకీయాల్లోకి రావడం.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అంతగా ప్రభావితం చేసే అంశం ఏమీకాదని ప్రశాంత్‌ కిషోర్‌ అభిప్రాయపడ్డారు. కాగా, సోమవారం ప్రియాంకా యూపీలో ఓ ర్యాలీలోనూ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘కాంగ్రెస్‌ పార్టీకి రాహుల్‌ గాంధీ.. అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిగా ప్రియాంక ఉన్నారు. ఆమె రాజకీయ రంగ ప్రవేశం వల్ల ఆ పార్టీకి ప్రస్తుతం మంచి ఫలితాలు రాకపోవచ్చు’ అని కిషోర్ వ్యాఖ్యానించారు.

అయితే, ప్రియాంక గాంధీ భవిష్యత్తులో ఆ పార్టీపై సానుకూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని అన్నారు. ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రకటన రాగానే తాను ఈ విషయాన్ని స్వాగతించానని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి వస్తే ఆ రాష్ట్రంలో ఈ ప్రభావం బాగా పడేదని నేను అనుకుంటున్నాను. కానీ, లోక్‌సభ ఎన్నికలు ప్రత్యేకమైనవి’ అని ఆయన అన్నారు. భవిష్యత్తులో ప్రియాంక చాలా కాలం ఎన్డీఏకు సవాలు విసరగలరని ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయ పడ్డారు.

చదవండి: దేశాన్ని విమర్శిస్తారా?: ‘మహా కల్తీ కూటమి’ అంటూ కాంగ్రెస్, విపక్షాలను ఏకేసిన మోడీ


- Advertisement -