‘సురక్షితమైన చేతుల్లోనే భారత్’: ఐఏఎఫ్ మెరుపుదాడిపై ప్రధాని మోడీ ఏమన్నారంటే…

3:46 pm, Tue, 26 February 19
narendra modi

narendra modi

జైపూర్: ఈ దేశం సురక్షితమైన చేతుల్లో ఉందన్న విశ్వాసాన్ని అందిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాజస్థాన్‌లోని చురులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మంగళవారం తెల్లవారు జామున నియంత్రణ రేఖ దాటి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం జరిపిన మెరుపు దాడిని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు.

మెరుపుదాడి వీరులకు తలవంచి నమస్కారం చేద్దామని పిలుపునిచ్చారు. ‘ఈ దేశం సురక్షితమైన చేతుల్లో ఉందన్న విశ్వాసాన్ని అందిస్తున్నా. దేశానికి, జాతికి ఎన్నటికీ తలవంపులు తీసుకురాను. సగర్వ భారతావని తల ఎత్తుకునే ఉంటుంది..’ అని మోడీ స్పష్టం చేశారు. దేశం మేల్కొని ఉందని, ప్రతి భారత పౌరుడికీ విజయం లభిస్తుందని ప్రధాని మోడీ అన్నారు.

దేశమే గొప్పది..

అంతేగాక, ‘ఈ దేశ గౌరవ మర్యాదలను మంటగలిపే పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. జాతి ప్రయాణం ఆగదు.. ఈ జాతి విజయయాత్ర కొనసాగుతూనే ఉంటుంది. జాతి నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ప్రధాన సేవకుడిలా నమస్కరిస్తున్నా. వ్యక్తి కంటే పార్టీ.. పార్టీ కంటే దేశం గొప్పదనే భావనతో పనిచేస్తున్నాం’ అని మోదీ వ్యాఖ్యానించారు.

ఓఆర్‌ఓపీ కింద మాజీ సైనికులకు రూ.35వేల కోట్లు అందించామని మోడీ చెప్పారు. నాలున్నరేళ్లలో పేదల కోసం 1.5 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టామని, పేదలు, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారం చేస్తున్నామని తెలిపారు.

కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద దేశవ్యాప్తంగా రైతులకు తొలి విడత నగదు జమ జరిగిందన్నారు. రాజస్థాన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు రైతుల జాబితా పంపలేదని, రాష్ట్ర ప్రభుత్వం పంపే జాబితా కోసం కేంద్రం ఎదురుచూస్తోందని తెలిపారు. రాజకీయాల కోసం రైతులకు రావాల్సిన డబ్బులను అడ్డుకోవద్దని ప్రధాని హితవు పలికారు. ఇలాంటి పథకాలను కూడా రాజకీయం చేయాలని చూస్తుంటే బాధేస్తోందని అన్నారు.

చదవండి: సర్జికల్ స్ట్రయిక్స్ 2.0: సత్తా చాటిన మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్! కార్గిల్ యుద్ధంలోనూ జైత్రయాత్ర…