30.2 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం మళ్లీ కొత్త డ్రామా! భారత పైలట్లపై పాక్ అటవీ శాఖ ఎఫ్ఐఆర్…

మళ్లీ కొత్త డ్రామా! భారత పైలట్లపై పాక్ అటవీ శాఖ ఎఫ్ఐఆర్…

pak fir against iaf pilots,Newsxpressonline
- Advertisement -

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారతీయ వైమానిక దళం పైలట్లు బాంబు దాడులు జరపడంపై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

భారత పైలట్లు తమ దేశంలోని అటవీ సంపదను నాశనం చేశారంటూ పాకిస్తాన్‌ అటవీ శాఖ ఆరోపిస్తూ.. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్ చేసింది. పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లను జైషే మహ్మద్ ఉగ్రవాదులు పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే.

అనంతరం నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన ఎయిర్ స్ట్రయిక్ జరిపిన సంగతీ తెలిసిందే. అయితే భారత్ ఈ మెరుపు దాడుల ద్వారా తమ అధీనంలో ఉన్న ప్రాంతంలోని 19 చెట్లు ధ్వంసం అయ్యాయంటూ భారత పైలట్లపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పాక్ అటవీ శాఖ పేర్కొంది.

భారత్ మెరుపు దాడుల గురించి ప్రస్తావించిన పాకిస్తాన్ క్లైమేట్‌ చేంజ్‌ మినిస్టర్‌ మాలిక్‌ అమీన్‌ మాట్లాడుతూ… ‘ పర్యావరణ ఉగ్రవాదానికి ఇదొక ఉదాహరణ. భారత్ చర్య కారణంగా బాలాకోట్‌లో డజన్ల కొద్దీ పైన్‌ చెట్లు నేలకూలాయి. మేమెంతో నష్టపోయాం. ఈ విషయమై చర్యలు ఉంటాయి..’ అని వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో భారత్‌ ఎకో టెర్రరిజానికి పాల్పడుతోందంటూ ఐక్యరాజ్యసమితిలో కూడా పాకిస్తాన్‌ ఫిర్యాదు చేయొచ్చు. భారత్‌పై నేరుగా ప్రతీకారం తీర్చుకోలేని దాయాది దేశం ఈ రకంగా అంతర్జాతీయ సమాజంలో భారత్‌ పరువు తీయడానికి వ్యూహ రచన చేస్తోంది.

మరోవైపు బాలాకోట్‌లో భారత వైమానిక దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారో చెప్పాలంటూ ప్రతిపక్షాలు.. మోడీ సర్కారును నిలదీస్తున్నాయి. ఈ విషయమై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా పాక్‌ అటవీ శాఖ ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేసిన నేపథ్యంలో ఈ యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కన్పిస్తున్నాయి.

- Advertisement -