

న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్‌కు చెందిన ఓ డ్రోన్ భారత భూభాగంలోకి చొచ్చుకొని రావడం కలకలం రేపింది. ఆ డ్రోన్‌ను గుర్తించిన వెంటనే భారత బలగాలు పేల్చివేశాయి.
మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో దీన్ని పేల్చివేశారు. గుజరాత్‌లోని కచ్ అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న నలియా ఎయిర్ బేస్ సమీపంలో గుర్తించిన దీన్ని అక్కడి సిబ్బంది వెంటనే పేల్చివేశారు. ఈ ఎయిర్ బేస్ సరిహద్దుకు అతి సమీపంలో ఉండటం గమనార్హం.
ఆ మూడు రాష్ట్రాల్లో హైఅలర్ట్
దాడుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూకాశ్మీర్, పంజాబ్‌లలో ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించగా.. గుజరాత్‌లోనూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాయుసేన హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించినా వెంటనే భద్రతా దళాలకు సమాచారం ఇవ్వాలని సూచించింది.
పుల్వామా దాడికి ప్రతీకారంగా మంగళవారం తెల్లవారుజామును భారత వైమానిక దళాలు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. దీంతో మూడు ఉగ్ర శిబిరాలు పూర్తిగా నాశనమయ్యాయి. ఈ దాడుల్లో సుమారు 300మందికి పైగా ఉగ్రవాదులు హతమై ఉంటారని అంచనా వేస్తున్నారు.
చదవండి: భారత్ మెరుపు దాడులు: పాక్ ఉగ్ర స్థావరాలు సర్వనాశనం








