
ఢిల్లీ: సర్జికల్ దాడులు విషయంలో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. సర్జికల్ దాడులని బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ… తమ హయాంలో కూడా ఆరుసార్లు సర్జికల్ దాడులు చేశామని.. కానీ ఎప్పుడు బహిరంగంగా చెప్పుకోలేదని బీజేపీకి కౌంటర్ ఇచ్చింది.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ వ్యాఖ్యలకు ప్రధాని మోడీ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం జైపూర్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ హయాంలో సర్జికల్ దాడులు కేవలం కాగితాలపైనే జరిగాయని ఎద్దేవా చేశారు.
సర్జికల్ స్ట్రైక్స్ చేశామంటూ కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. తమ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్లు ప్రకటించగానే కాంగ్రెస్ ఖండించిందని, ఆ తర్వాత దాన్ని వ్యతిరేకించిందని చెప్పారు.
ఇక యూపీఏ హయాంలో మూడుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిపినట్లు ఆ పార్టీ నేత రాహుల్ ప్రకటించారని, ఇప్పుడేమో మరొక నేత దానిని ఆరుసార్లకు పెంచారని, ఈ ఎన్నికలు పూర్తయ్యేలోగా ఈ సంఖ్య 600కు చేరుకుంటుందని ఎద్దేవా చేశారు. కాగితాలపైనే చేసిన ఈ దాడులతో ఫలితమేంటి? అని, కాంగ్రెస్ అబద్ధాలు మాత్రమే చెబుతుందని మోడీ మండిపడ్డారు.
చదవండి: మేమూ సర్జికల్ స్ట్రైక్స్ చేశాం… మీలా ఛాతీ చరుచుకోలేదు: బీజేపీకి కాంగ్రెస్ కౌంటర్








