ఏపీకి సూర్యోదయమా? బాబుకు పుత్రోదయమా?: ఓటర్లకు ప్రధాని మోడీ పిలుపు

6:06 pm, Fri, 29 March 19
Narendra Modi Latest News, Chandrababu Naidu Latest News, Newsxpressonline

కర్నూలు: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్‌లపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కర్నూలులో నిర్వహించిన ఎన్నికల సభలో నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఆంగ్లంలో ఎస్ యు ఎన్ అంటే సూర్యుడు అని.. ఎస్ ఓ ఎన్ అంటే కుమారుడు అని అర్థమని చెప్పారు.

మీరు బీజేపీకి వేసే ఓటుతో ఏప్రిల్ 11 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త సూర్యోదయాన్ని చూస్తారని.. అదే సమయంలో ఎవరైతే తన పుత్రుడి రాజకీయ ఎదుగుదలను చూడాలనుకుంటున్నారో వారి ఆశలకు, ఆకాంక్షలకు అస్తమయం అవుతుందని చంద్రబాబు, లోకేష్‌లను ఉద్దేశించి ప్రధాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్నోసార్లు అనేక అంశాలపై యూటర్న్‌లు తీసుకున్నారని మండిపడ్డారు. ఆయన యూటర్న్ బాబుగా మారరని ఎద్దేవా చేశారు.

బీజేపీకి ఓటేస్తే ఏపీకి సూర్యోదయం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూర్యోదయం కావాలనుకుంటే బీజేపీకి ఓటేయాలని నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. రేపు మీరు వేయబోయే ఓటు కారణంగా డబుల్ ఇంజిన్లతో రాష్ట్రాభివృద్ధి పరుగులు పెడుతుందని మోడీ అన్నారు. ఒక ఓటుతో కేంద్రంలో, మరో ఓటుతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, జోడు ఇంజిన్లతో ప్రగతి పథంలో దూసుకుపోతామని వ్యాఖ్యానించారు.

తాను ఏపీకి ఎంతో చేయాలనుకున్నానని, కానీ రాష్ట్ర ప్రభుత్వం కలిసిరావడం లేదని మోడీ విమర్శించారు. కర్నూలులో ఐఐఐటీ, మెగా పవర్ పార్క్ ఇచ్చింది తానేనని.. విశాఖలో రైల్వే జోన్ ఇచ్చింది తమ ప్రభుత్వమేనని మోడీ వివరించారు. అంతేగాక, కర్నూలు వచ్చిన తొలి ప్రధానమంత్రిని కూడా తానేనని ఆయన వ్యాఖ్యానించారు.

ఏపీకి తొలి గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేశామని చెప్పారు. ఐఐఎం, రాజమండ్రి, కడప విమానాశ్రయాల విస్తరణ, ఇలా ఎన్నో చేసినా రాష్ట్ర ప్రభుత్వం తమతో కలిసి పని చేయడం లేదని విమర్శించారు. ప్రధాని అయ్యాక తొలి మంత్రి వర్గ సమావేశంలోనే పోలవరానికి అనుమతులు మంజూరు చేశామని గుర్తు చేశారు.

చదవండి: స్వార్థం కోసం ప్రజాధనం వృథా చేశారు: కేసీఆర్‌పై విరుచుకుపడిన మోడీ