స్వార్థం కోసం ప్రజాధనం వృథా చేశారు: కేసీఆర్‌పై విరుచుకుపడిన మోడీ

5:51 pm, Fri, 29 March 19
MP Narendra Modi Latest News, CM KCR Latest News, Newsxpresonline

మహబూబ్‌నగర్: తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను ఎందుకు ముందస్తుగా నిర్వహించారని ప్రధాని ప్రశ్నించారు. జ్యోతిష్యుడు చెప్పడం వల్లే కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని, చివరికి మంత్రివర్గ కూర్పునకు కూడా అతణ్నే సంప్రదిస్తున్నారని ఎద్దేవా చేశారు.

ప్రజాధనం వృథా చేశారు..

అందుకే మంత్రి వర్గ కూర్పు మూడు నెలలైన ఇంకా పూర్తి కాలేదని ధ్వజమెత్తారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లకుండా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ సార్వత్రిక ఎన్నికలతో పాటే నిర్వహించి ఉంటే వందల కోట్ల ప్రజా ధనం ఆదా అయ్యేది కదా అని హితవు పలికారు.

మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడుతూ..
‘ఏప్రిల్, మే నెలల్లో మోడీ స్టార్ బాగా నడుస్తుందని కేసీఆర్‌కు జ్యోతిష్యులు చెప్పారు. ఆ సమయంలో మోడీ చరిష్మాను తట్టుకోలేరని, మే నెలలో ఒకేసారి ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ ఓడిపోతుందని కూడా చెప్పారు. అందుకే తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు’ అని మోడీ ఎద్దేవా చేశారు.

జ్యోతిష్యులు చెప్పినట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందన్న మోడీ.. పాలనను గాలికి వదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పాలనను ప్రజలు నిర్ణయించాలా? జ్యోతిష్కుడు నిర్ణయించాలా? అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక కొడుకు, కూతురు, అల్లుడుకు పదవులిచ్చారని విమర్శించారు. కుటుంబ రాజకీయాలు చేస్తున్న కేసీఆర్.. మతన్మోద పార్టీ మజ్లిస్‌తో చేతులు కలిపారని దుయ్యబట్టారు. కేవలం తమ కుటుంబం కోసమే ఆలోచించే పార్టీలతో దళితులు, వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగదని మోడీ వ్యాఖ్యానించారు.

గతంలో కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఉండడం వల్ల కేసీఆర్‌కే మేలు జరిగింది. ఇక్కడి ప్రజలు ఎంపీగా గెలిపిస్తే ఆయన జిల్లాకు ఏమీ చేయలేదు. కేవలం కుటుంబానికి మేలు చేసుకున్నారు. కేసీఆర్‌ మిమ్మల్ని గాలికొదిలేసి పోయింది వాస్తవమా కాదా? ఆయన కుటుంబ ప్రయోజనం కోసం పని చేస్తున్నారా లేదా? అని మోడీ ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్‌ ఎంఐఎం కూటమి తెలంగాణ ప్రయోజనం కోసం కాదు.. వాళ్ల స్వప్రయోజనాల కోసం, ఓటు బ్యాంకు కాపాడుకోవడం కోసం. మీరంతా ఆలోచించాలి. పాలమూరు ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించిన వారు ఒకవైపు ఉంటే.. పాలమూరు ప్రజల అభివృద్ధి కోసం నేను మరోవైపు ఉన్నా. ఏయిమ్స్‌, సైనిక్‌ స్కూల్‌, రైల్వే, జాతీయ రహదారులు వంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి ఇచ్చాం. 2014కు ముందు ఇప్పటికీ పోల్చుకోవాలి. మహబూబ్‌నగర్‌ ప్రజల సౌకర్యార్థం రైల్వే లైన్ల కోసం పాటుపడుతున్నది బీజేపీ ప్రభుత్వమేనని మోడీ చెప్పారు.

కేంద్ర పథకాలను తమవేనంటూ..

కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ తెరాస మావే అని చెప్పుకొంటోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు పేరు మార్చి కేసీఆర్‌ తమ పథకాలుగా చెప్పుకుంటున్నారు. పేదవారికి కోటి 50 లక్షల మందికి మేం ఇళ్లు కట్టించాం. మాకు మీ ఇళ్లు వద్దంటూ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు అన్నారు. ఆఖరికి వాటిని కూడా అటకెక్కించారు. పేద ప్రజలకు పెద్ద జబ్బులు వస్తే చికిత్స కోసం ఆయుష్మాన్‌ భారత్‌ ప్రవేశపెట్టాం. దీనివల్ల రూ.5 లక్షల వైద్య బీమా సౌకర్యం ఉంటుంది. ఈ పథకాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం వద్దంటోంది. పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందించే కార్యక్రమాలు ఈ చౌకీదార్‌ ప్రభుత్వమే ప్రవేశపెడుతోంది.

నవ భారతం కోసం ఓటేయండి..

తాను ఈ దేశానికి కాపలాదారుడినని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాయని చెప్పారు. 60ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాలు చాలానే జరిగాయని.. ఇప్పుడు అవన్నీ అరికట్టామని చెప్పారు. నవ భారతం కోసం ఓటేయండి. భారతదేశ సామర్థ్యం గురించి ప్రపంచం గమనిస్తోంది. రాబోయే ఐదేళ్లలో భారత కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరుగుతాయని మోడీ స్పష్టం చేశారు. పేదవారికి రిజర్వేషన్లు కల్పించడం తమ ఘనతేనని వ్యాఖ్యానించారు.

మోడీకి కానుకగా ఇద్దాం: డీకే అరుణ

అంతకుముందు బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ.. పాలమూరులో పుట్టి పెరిగిన తాను ఈ ప్రాంతం అభివృద్ధికి అహర్నిశలు తాపత్రయ పడ్డానని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు, కేసీఆర్‌ నిరంకుశ పాలనను అంతమొందించడానికే తాను మోడీ సైన్యంలో ఓ సైనికురాలిగా చేరానన్నారు. శుక్రవారం పాలమూరు వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారతదేశంలో తన ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.

ప్రపంచంలోనే మోడీ ఓ బలమైన నాయకుడిగా నిలిచారని, ప్రపంచ దేశాల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపారని కొనియాడారు. దేశ ప్రజలంతా మోడీవైపే చూస్తున్న తరుణంలో పాలమూరు ఎంపీ స్థానాన్ని గెలిపించి ఆయనకు కానుకగా ఇవ్వాలని డీకే అరుణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాజపా నేతలు లక్ష్మణ్‌, దత్తాత్రేయ, డీకే అరుణ, బంగారు శ్రుతి, జితేందర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.