

న్యూఢిల్లీ : పెళ్లి విందు భోజనం బాగా లేదని…హోటల్ సిబ్బందితో అతిధులు బాహాబాహీకి దిగిన ఘటన పశ్చిమఢిల్లీ నగరంలో వెలుగుచూసింది. ఢిల్లీలోని జనక్‌పురి ప్రాంతంలోని ఓ హోటల్ లో ఓ జంట పెళ్లి సందర్భంగా విందు ఏర్పాటు చేశారు.
పెళ్లికి దాదాపు 500 మందికి పైగా అతిథులు వచ్చారు. వారందరికీ విందు భోజనం వడ్డించే కాంట్రాక్టును హోటల్ కే అప్పగించారు.ఈ విందు భోజనం నచ్చకపోవడంతో పెళ్లికి వచ్చిన అతిధులు హోటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదేమి భోజనమంటూ హోటల్ సిబ్బందిని అతిధులు కొట్టడమే కాకుండా పింగాణి ప్లేట్లను ముక్కలు చేసి విధ్వంసం సృష్టించారు. ఆగ్రహించిన అతిధులు హోటల్ లో ఫర్నిచరుతోపాటు ప్లేట్లను కూడా ముక్కలు చేశారు.
పెళ్లిని చిత్రీకరించడానికి వచ్చిన వీడియోగ్రాఫరు కాస్తా ఈ విధ్వంసాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ అయింది. ఈ క్రమంలోనే ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఘటనపై పోలీసులకు అరా తీస్తున్నారు.








