వామ్మో.. ఇదేం ఐసోలేషన్ సెంటర్? సరైన తిండీ లేదు, శుభ్రత అంతకన్నా.. 70 ఏళ్ల వృద్ధుడు పరార్!

- Advertisement -

పుణె: తనను ఉంచిన ఐసోలేషన్ కేంద్రంలో సరైన సదుపాయాలు లేవన్న కారణంతో కరోనా రోగి అయిన వృద్ధుడు అక్కడి నుంచి తప్పించుకున్న ఇంటికి చేరుకున్నాడు. మహారాష్ట్రలోని పూణెలో జరిగిందీ ఘటన.

చదవండి: కరోనా వ్యాక్సిన్: కోతుల్లో సత్ఫలితాలు ఇస్తోన్న టీకా.. చిగురిస్తోన్న ఆశలు!

నగరానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో అధికారులు ఆయనను ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.

అయితే, అక్కడ సరిగా తిండిపెట్టకపోవడం, కేంద్రం శుభ్రంగా లేకపోవడంతో అతడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

అక్కడి నుంచి నడుచుకుంటూ 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి చేరుకుని బయట కూర్చున్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందుకున్న అధికారులు అతడి ఇంటికి చేరుకుని మళ్లీ ఐసోలేషన్ కేంద్రానికి పంపేందుకు ప్రయత్నించగా రానని మొండికేశాడు.

దీంతో అతడి కుమారుడితో మాట్లాడించి ఒప్పించడంతో తిరిగి వెళ్లేందుకు అంగీకరించాడు. ఐసోలేషన్ కేంద్రం నుంచి నడిచి వచ్చే సమయంలో తాను ఎవరినీ కలవలేదని చెప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

చదవండి: హైదరాబాద్‌లో పోలీసులపై వలస కూలీల దాడి.. ఉద్రిక్తత
- Advertisement -