హుబ్బాలి: ఎయిడ్స్ కారక హెచ్‌ఐవీ వైరస్ సోకిన మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవటంతో.. చెరువులోని నీటిని తోడిపడేస్తున్నారు.. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హుబ్బాలి జిల్లా మోరబ్ జిల్లాలో దాదాపు 36 ఎకరాలలో విస్తరించి ఉన్న మంచి నీటి చెరువు ఉంది.
గత నవంబర్ 29వ తేదీన ఓ మహిళ మృతదేహం ఆ చెరువులో కనిపించింది. ఆమె మృతదేహాన్ని అప్పటికే చెరువులోని చేపలు సగానికి పైగా తినేశాయి. ఈ క్రమంలో చనిపోయిన మహిళకు హెచ్ఐవీ సోకిందని, ఆ నీటిని తాగితే తమకు కూడా హెచ్ఐవీ సోకుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నీటిని తాము తాగమంటూ.. చెరువులోని నీరు మొత్తాన్ని ఖాళీ చేయాలని వారు డిమాండ్ చేశారు.
అయితే.. చెరువులో నీటిని తాము పరిశీలించామని.. అలాంటి వైరస్ ఏదీ నీటిలో కలవలేదని.. స్థానికులకు నచ్చచెప్పే ప్రయత్నం సంబంధిత అధికారులు చేసినా స్థానికులు వినిపించుకోలేదు. దీంతో అధికారులు చేసేదేమీ లేక.. దాదాపు 20 ట్యూబ్‌లతో చెరువులో నీటిని ఖాళీ చేస్తున్నారు.
మరో మంచినీటి చెరువు నుంచి నీటిని తీసుకు వచ్చి చెరువుని మళ్ళీ నింపుతామని అధికారులు స్థానికులకు హామీ ఇచ్చారు. అయితే హెచ్ఐవీ వైరస్ నీరు, గాలి వంటి వాటి ద్వారా వ్యాప్తి చెందదని ఈ సందర్బంగా మరోసారి అధికారులకు చెప్పే ప్రయత్నం చేశారు.