
చెన్నై: ఇటీవల తమిళనాడులో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఎన్‌ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ హిందువులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే తొలి భారత ఉగ్రవాది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
అయితే ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటం… వారిని ఆకర్షించేందుకు ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శలు వచ్చాయి. కానీ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయని తాను మాట్లాడలేదని , వాస్తవాన్ని చెబుతున్నాననీ కమల్ హాసన్ అన్నారు.
చదవండి: హిందూ టెర్రరిస్ట్ వ్యాఖ్యలు: కమల్ నాలుక తెగ్గోయాలంటున్న తమిళ మంత్రి
ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కమల్ హాసన్‌పై 3 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు అరవకురిచి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఐపీసీలోని సెక్షన్లు 153A, 295A కింద కేసు నమోదు చేశారు.
అటు ఢిల్లీలో కూడా రెండు కేసులు నమోదయ్యాయి. కమల్ హాసన్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ బీజేపీ నేత, లాయర్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్… ఢిల్లీ హైకోర్టులో పిల్ వేశారు. ఆయన్ని 5 రోజుల పాటు ఎన్నికల్లో ప్రచారం చేయకుండా నిషేధం విధించాలని ఈసీని కోరారు.








