
జమ్ముకశ్మీర్: కశ్మీర్ ప్రస్తుతం ప్రశాంతంగా ఉందని, ప్రతిపక్ష పార్టీల నేతలు సందర్శించాల్సిన అవసరమేం లేదని, దీనిని పెడచెవిన పెట్టి వారు కశ్మీర్ సందర్శనకు వస్తే సామాన్య ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని పేర్కొంటూ జమ్ము కశ్మీర్ ప్రభుత్వం శుక్రవారం రాత్రి కీలక ప్రకటన చేసింది.
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్ శనివారం శ్రీనగర్‌ను సందర్శించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన కశ్మీర్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నేతలెవరూ శ్రీనగర్ రావొద్దంటూ తన అధికారిక ట్విట్టర్ ద్వారా కోరింది. సీనియర్ నేతలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరింది.
‘‘పర్యటనకు వచ్చి ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీయకండి..’’
కశ్మీర్‌లో శాంతిభద్రతలు, ప్రజల ప్రాణాలకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడికొచ్చి ఆ వాతావరణాన్ని దెబ్బతీయొద్దని ప్రతిపక్షాల నేతలను ప్రభుత్వం కోరింది.
ఉగ్రవాదులు, వేర్పాటువాదులు, సీమాంతర ఉగ్రవాదం నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వేళ ఇక్కడికొచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని ఆ ప్రకటనలో కశ్మీర్ ప్రభుత్వం అభ్యర్థించింది.








