ఇస్రోకు మిగిలింది మరో పది రోజులే.. ప్రయత్నాలు ఫలిస్తాయా?

9:12 pm, Wed, 11 September 19

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు మిగిలింది ఇక పది రోజులే. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగుతూ సిగ్నల్స్ కోల్పోయినప్పటి నుంచి దానితో సంబంధాల పునరుద్ధరణకు ఇస్రో ప్రయత్నిస్తూనే ఉంది.

విక్రమ్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి పరిశోధనలు చేసేందుకు ఉన్న సమయం 14 రోజులు కాగా, ఇప్పటికే నాలుగు రోజులు గడిచిపోయింది. ఇక మిగిలింది పది రోజులే.

గత నాలుగు రోజులుగా ‘విక్రమ్’తో కమ్యూనికేషన్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఈ నెల 21 తర్వాత ల్యాండర్‌తో కమ్యూనికేషన్ కుదరదు.

ఎందుకంటే, చంద్రునిపై ఒక లూనార్ డే టైమ్ మాత్రమే పని చేసేలా విక్రమ్‌ను రూపొందించారు. ఒక లూనార్ డే అంటే 14 రోజులు. విక్రమ్‌ను చంద్రుడిపై ల్యాండ్ చేయడానికి ప్రయత్నించిన రోజు సెప్టెంబర్ 7.

లూనార్ డే సెప్టెంబర్ 21న ముగుస్తుంది. సెప్టెంబర్ 22 నుంచి లూనార్ నైట్ మొదలవుతుంది. చంద్రుడిపై రాత్రి సమయం అతి శీతలంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మైనస్ 2 వేల డిగ్రీ సెల్సియస్‌కు పడిపోతాయి.

అలాంటి వాతావరణాన్ని తట్టుకోవడం ల్యాండర్‌కు సాధ్యం కాదు. లూనార్ నైట్ ముగిసి మరో లూనార్ డే వచ్చిన తర్వాత కూడా ల్యాండర్ పని చేయడం అసాధ్యం. కాబట్టి ఇస్రో ఏం చేసినా ఈ నెల 21లోపే చేయాలి. ఆలోపు కమ్యూనికేషన్ జరిగితే అద్భుతమే.