
అమరావతి: మందుబాబులకు ఇది నిజ్జంగా గుడ్ న్యూసే. గతంలో ఎన్నడూ లేనంతగా మద్యం అమ్మకాలు ఇప్పుడు జోరందుకున్నాయి. ఉన్న సరుకును క్లియర్ చేసుకునేందుకు మద్యం దుకాణదారులు అమ్మకాలపై భారీ డిస్కౌంట్లు, గిప్ట్ ఆఫర్లు ఇస్తూ మందుబాబులను తమవైపు తిప్పుకుంటున్నారు.
నూతన మద్యం పాలసీలో భాగంగా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి మద్యం విక్రయాలను ప్రభుత్వమే నిర్వహించనుండడంతో విజయవాడలోని ఓ దుకాణంలో రూ.2వేల ఖరీదు చేసే మందు బాటిల్‌పై ఏకంగా రూ.300కు పైగా రాయితీ ఇస్తున్నారు.
దీంతో పాటు ఒకేసారి మూడు నాలుగు సీసాలు కొంటే లెదర్ బ్యాగ్‌లు, టూరిస్ట్ బ్యాగులు ఇస్తున్నారు. విజయవాడతో పాటు పలు నగరాల్లో ఇలా రాయితీలు అందిస్తూ మద్యం స్టాక్‌ను క్లియర్ చేసుకునే పనిలో పడ్డారు.
పట్టణాల్లో మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉండడంతో అందుకు అనుగుణంగా ముంగానే భారీగా సరుకును నిల్వ ఉంచుకున్నవారు ఇప్పడు ఆ సరుకును ఈ నెల 31లోగా క్లియర్ చేసుకునే బిజీలో ఉన్నారు.
షాపు లైసెన్సు గడువు ముగిసే సమయంలో మిగిలిపోయిన మద్యాన్ని ఎక్సైజ్‌శాఖ తీసుకుంటుంది. దీంతో ముందే ఆ సరుకును క్లియర్ చేసుకోవాలని దుకాణదారులు భావిస్తున్నారు.
తిరిగి లైసెన్సు తమకే వస్తుందని ఆశించిన వ్యాపారులు సరుకును నిల్వ చేసుకుని లైసెన్సు దక్కక గతంలో నష్టపోయిన సందర్భాలు గతంలో అనేకం. అందుకనే ఈసారి ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. ఉన్న సరుకును గడువు ముగిసే లోగా ఎలాగోలా వదిలించుకోవాలని చూస్తున్నారు.








