
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను ఈ నెల 14 తరువాత ఎత్తివేస్తారా? గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏం చెప్పారు? ఇవి ప్రస్తుతం దేశంలోని అన్ని వర్గాల ప్రజానీకం మనసులో ఉదయిస్తోన్న ప్రశ్నలు.
చదవండి: దేశంలో భయపెడుతున్న కరోనా కేసులు.. 2 వేల మార్క్ దాటేసిన వైనం!
మరోవైపు దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఇంకా నియంత్రణలోకి రావడం లేదు. అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గురువారం నాటికి దేశంలో కరోనా మృతుల సంఖ్య 53కు చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్య 2069 అని వైద్య ఆరోగ్య శాఖ తాజా లెక్క చెబుతోంది.
అయితే దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడి చికిత్స తరువాత కోలుకున్న వారు 156 మంది. అయితే కొత్త కేసుల సంఖ్య మాత్రం రోజురోజుకీ పెరుగుతూనే పోతోంది. దీనికి తాజా కారణంగా ఢిల్లీలో ఇటీవల చోటుచేసుకున్న నిజాముద్దీన్ మర్కజ్ సమావేశ ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పిందేమిటి?
ఈ పరిస్థితుల నేపథ్యంలో గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు.
దేశంలో, వివిధ రాష్ట్రాల్లో కోవిడ్-19 వ్యాప్తి, తీసుకుంటున్న చర్యలపై సమీక్షించిన మోడీ ఆపైన మాట్లాడుతూ… రాబోయే కొన్ని వారాల్లో.. టెస్టింగ్, ట్రేసింగ్, ఐసొలేషన్, క్వారంటైన్‌లపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
చదవండి: విజయవాడలో డేంజర్ బెల్స్.. ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా
అలాగే దేశంలో కరోనా వైరస్ కేసుల పెరుగుదల, నిజాముద్దీన్ మర్కజ్ ద్వారా వైరస్ వ్యాప్తి, సమర్థంగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపైనా సమావేశంలో ఆయా రాష్ట్రాల సీఎంలతో చర్చించినట్లు సమాచారం.
అంతేకాదు, మందులు, వాటి తయారీకి అవసరమయ్యే సామగ్రి, అత్యవసర వైద్య పరికరాలు అవసరమైనంత స్థాయిలో సిద్ధంగా ఉంచుకోవాలని కూడా సీఎంలకు ప్రధాని సూచించినట్లు తెలుస్తోంది.
14 తర్వాత లాక్‌డౌన్ ఎత్తేస్తారా?
మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కొనసాగుతోన్న లాక్‌డౌన్ ఈ నెల 14వ తేదీతో ముగుస్తుందా? లేకపోతే మళ్లీ దీనిని మరికొంత కాలం పొడిగిస్తారా? అనేవి చర్చనీయాంశంగా మారాయి.
గురువారం నాటి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ తరువాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ చేసిన ఓ ట్వీట్ ఈ తరహా అనుమానాలు రేకెత్తించింది.
Chief Minister of Arunachal Pradesh Pema Khandu tweets after the video conference meeting of Chief Ministers with Prime Minister Narendra Modi. #CoronaLockdown pic.twitter.com/yOr8iMaX5p
— ANI (@ANI) April 2, 2020
“ఏప్రిల్ 15తో లాక్‌డౌన్ ముగుస్తోంది. కానీ, దాని అర్థం స్వేచ్ఛగా వీధుల్లో తిరగొచ్చని కాదు. వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో మనందరం బాధ్యతాయుతంగా మెలగాలి. సామాజిక దూరం పాటించడం, లాక్‌డౌన్ మాత్రమే కోవిడ్-19ను ఎదుర్కొనే మార్గాలు..” అని ఆ ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.
అయితే, ఈ ట్వీట్‌ను ఆ తరువాత కాసేపటికే తొలగించారు. హిందీ భాషను సరిగా అర్థం చేసుకోలేని ఓ అధికారి ఈ ట్వీట్‌ను పోస్ట్ చేశారని, అందువల్ల దాన్ని తొలగిస్తున్నామంటూ సాక్షాత్తూ సీఎం పెమా ఖండూ వివరణ కూడా ఇచ్చారు.
The tweet with respect to the lockdown period was uploaded by an officer who was not fluent in Hindi. Therefore the same was withdrawn: Arunachal Pradesh Chief Minister Pema Khandu https://t.co/y7jh4VKzdw
— ANI (@ANI) April 2, 2020
మరి ఈ సంకేతాలకు అర్థమేమిటో?
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 15నుంచి ఇటు రైలు టిక్కెట్లు, అటు విమాన టిక్కెట్ల బుకింగ్ మొదలైంది. ఇదంతా చూస్తోంటే ఈ నెల 14 తరువాత లాక్‌డౌన్‌ను కచ్చితంగా తొలగిస్తారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. వీటికి మరింత బలం చేకూర్చేలా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ కూడా రైలు టిక్కెట్ల బుకింగ్‌ను ప్రారంభించింది.
చదవండి: దేశంలోని విదేశీయులను తరలించేందుకు.. లండన్‌కు ఎయిరిండియా ప్రత్యేక విమానాలు
అందుబాటులో ఉన్న టికెట్ల సంఖ్య, వెయిటింగ్ లిస్టులను చూస్తుంటే.. చాలామంది ఐఆర్‌సీటీసీ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్నారనేది కూడా స్పష్టమవుతోంది. అలాగే కొన్ని వెబ్‌సైట్లలో దేశీయ విమాన ప్రయాణాలకూ టిక్కెట్ల బుకింగ్ మొదలైంది.
అయితే అటు కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కొనసాగుతోన్న లాక్‌డౌన్ ఎత్తివేతపైగాని, 14 తరువాత ప్రజా రవాణాకు అనుమతిచ్చినట్లుగా ఎలాంటి సూచనలుగాని, సమాచారంగానీ లభించడం లేదు. దీంతో అసలు లాక్‌డౌన్ ఎత్తివేస్తారా? లేదా? అనేది దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.








