
జైపూర్: సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్.. కవ్వింపు చర్యలను మానుకోవడం లేదు. తాజాగా, భారత గగనతలంలోకి ఓ పాకిస్తాన్ డ్రోన్ ప్రవేశించింది. గమనించిన భద్రతా బలగాలు ఆ డ్రోన్‌ని కూల్చివేశాయి.
రాజస్థాన్‌లోని బికనేర్ నల్ సెక్టార్‌లోకి ప్రవేశించిన డ్రోన్‌ను సోమవారం ఉదయం 11.30 గంటలకు ‘సుఖోయి 30ఎంకేఐ’ ద్వారా ఆ డ్రోన్‌ను కూల్చేసినట్లు సమాచారం. భారత గగనతల నిబంధనలను ఉల్లంఘిస్తూ పాక్ ఈ చర్యకు పాల్పడిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
వెంటనే స్పందించిన భద్రతా దళాలు
సరిహద్దు ప్రాంతంలోకి పాక్‌కు చెందిన డ్రోన్ ప్రవేశించిన వెంటనే గుర్తించిన భారత భద్రతా దళాలు.. దాన్ని పేల్చేశాయి. భారత వైమానిక దళ రాడార్ల ద్వారా భద్రతా సిబ్బంది దాన్ని గుర్తించి, వెంటనే ప్రతిస్పందించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
గత కొద్దిరోజుల క్రితం, గుజరాత్‌లోని కచ్ అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న నలియా ఎయిర్ బేస్ సమీపంలో పాక్‌కు చెందిన మరో డ్రోన్‌ని భారత్ కూల్చి వేసిన విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా.. పాక్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడులు జరిపి ధ్వంసం చేశాయి.
ఆ తర్వాత కొన్ని గంటల్లోనే పాకిస్తాన్‌కు చెందిన ఓ డ్రోన్ భారత భూభాగంలోకి చొచ్చుకురాగా.. దాన్ని భారత భద్రతాదళాలు కూల్చివేశాయి.
చదవండి: ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం, శవాలను లెక్కించం: ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా








