
న్యూఢిల్లీ: రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 30 వరకు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు బుక్ చేసుకున్న టిక్కెట్ల డబ్బును తిరిగి చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు జాతీయ మీడియాలో ఓ కథనాలు ప్రచురితమయ్యాయి.
మొన్నటి వరకు కరోనా లాక్‌డౌన్ కారణంగా ఎక్కడి వాళ్లు అక్కడే ఆగిపోయారు. ఇటీవల లాక్‌డౌన్ నిబంధనలను కేంద్రం సడలించడంతో రైల్వే శాఖ వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు శ్రామిక్ రైళ్లు నడపడం ప్రారంభించింది.
దీంతోపాటు దేశ రాజధాని ఢిల్లీ నుంచి దేశంలోని వివిధ నగరాలకు 15 ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది. ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవాలని కూడా సూచించింది.
శ్రామిక్, ప్రత్యేక రైళ్లు రద్దు కాలేదు…
అయితే ఇప్పుడు రైల్వే శాఖ రద్దు చేసిన రైళ్లు ఇవి కాదు. శ్రామిక్ రైళ్లు, ప్రత్యేక రైళ్లు యథావిధిగానే తిరుగుతాయి. లాక్‌డౌన్‌కు ముందు, ఇటీవల రైళ్ల పున:ప్రారంభానికంటే ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న రైళ్లు మాత్రమే రద్దయ్యాయి.
సాధారణంగా నాలుగు నెలల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు చాలామంది ఇలా బుక్ చేసుకున్నారు కూడా. ఇప్పుడు ఈ ప్యాసింజర్ రైళ్లనే రైల్వే అధికారులు రద్దు చేశారు.








