
న్యూఢిల్లీ: కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఈఐటీవై) సరికొత్త ఆవిష్కరణల సవాలును ప్రారంభించింది.
విదేశీ మెసేజింగ్ యాప్ వాట్సాప్, వీడియో చాటింగ్ యాప్ జూమ్‌లకు సరిసమానమైన యాప్‌లను రూపొందించే వారికి కోటి రూపాయల నజరానా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 30 వరకు స్వీకరించనుంది.
మూడు దశలలో…
ఈ సవాలును ఐడియేషన్, ప్రోటోటైప్, సొల్యూషన్ బిల్డింగ్ అనే మూడు దశలుగా విభజించారు. మొదటి దశలో ప్రభుత్వం 10 మంది దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తుంది.
వీరు తమ ప్రాజెక్టులను తదుపరి దశకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇస్తుంది. రెండో దశలో అప్లికేషన్ నమూనా రూపొందించేందుకు ఉత్తమ జట్లను షార్ట్ లిస్ట్ చేస్తుంది.
తుది దశలో టాప్-3 జట్లను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ ప్రాజెక్టును చివరి దశకు తీసుకెళ్లేందుకు అర్హత కలిగిన ఒక్కో జట్టుకు రూ. 20 లక్షల చొప్పున లభిస్తుంది.
చివరి దశలో విజేతను ఎంపిక చేసి కోటి రూపాయల బహుమతిని విన్నింగ్ జట్టుకు అందిస్తుంది. అలాగే ఆ బృందానికి ఎంఈఐటీవై నుంచి సర్టిఫికెట్ కూడా లభిస్తుంది.
విజేత జట్టు ఆపరేషన్స్, మెయింటెనెన్స్ కోసం ఏడాదికి రూ. 10 లక్షల బడ్జెట్‌తో మూడేళ్లపాటు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ప్రస్తుతం అత్యంత విశ్వసనీయమైన టెలికాన్ఫరెన్సింగ్ అప్లికేషన్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇటీవల జూమ్ యాప్ వినియోగంపై కేంద్రం హోం మంత్రిత్వ శాఖ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం లాక్‌డౌన్ అయిన నేపథ్యంలో ఈ యాప్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. అయితే, ఈ యాప్ భద్రతా సమస్యలలో చిక్కుకుంది.
వీటిలో కొన్నింటిని సరిచేసినప్పటికీ చెడ్డపేరును మూటగట్టుకుంది. ఈ యాప్‌కు దూరంగా ఉండాలని గూగుల్, స్పేస్ ఎక్స్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను కోరడం జూమ్ యాప్ ప్రభ మసకబారింది.








